Registration services, village secretariats – 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు.. ఏపీ సర్కార్‌ కీలక ముందడుగు

దాదాపు ఏడాది నుంచి ప్రతిపాదన దశలో ఉన్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవల వ్యవహారం కార్యరూపం దాల్చబోతోంది. వచ్చే నెలలో ఎంపిక చేసిన 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు జగన్‌ సర్కార్‌ వేగంగా ముందడుగు వేస్తోంది. రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమయ్యేందుకు వీలుగా ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సచివాలయ కార్యదర్శికి సబ్‌ రిజిస్ట్రార్‌గా తాత్కాలిక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా రిజిస్ట్రేషన్‌ సేవల్లో డిజిటల్‌ అసిస్టెంట్లు సహాయ సహకారాలు అందించాలని సూచనలు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఇకపై గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ, ప్రతి నాలుగువేల మందికి ఒక వార్డు సచివాలయంలను జగన్‌సర్కార్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన జగన్‌ సర్కార్‌.. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చింది. విప్లవాత్మకమైన సంస్కరణలతో పరిపాలనను, ప్రభుత్వ సేవలను పొందడాన్ని సరళతరం చేసిన జగన్‌ ప్రభుత్వం.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసి సేవలందిస్తోంది. ఆధార్‌ సేవలు కూడా గ్రామ సచివాలయాల ద్వారానే అందిస్తోంది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ ఆలోచించారు. తద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతోపాటు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి చెక్‌ పెట్టవచ్చని భావించారు. ఈ క్రమంలోనే సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాలలో విడతల వారీగా రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించాలని తలపోశారు.

సీఎం జగన్‌ ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడతలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించేందుకు 51 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. భూముల క్రయ, విక్రయాలు ఎక్కువగా జరిగే పట్టణాలు, నగరాలకు సమీపంలోని గ్రామ సచివాలయాలను ముందుగా ఎంచుకున్నారు. 51 మంది గ్రామ సచివాలయ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది జూన్‌ 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఐ)లో వారికి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తవడంతో.. ఇక రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించేందుకు వీలుగా కార్యదర్శులకు సబ్‌ రిజిస్ట్రార్‌గా అధికారాలు (తాత్కాలికం) కల్పిస్తూ జగన్‌ సర్కార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ముగిసే లోపు ఈ సేవలను ప్రారంభించాలని సర్కార్‌ యోచిస్తోంది.

Also Read : Ap Farm Policy – సాగు చట్టాల కన్నా ఏపీ వ్యవసాయ విధానమే భేష్‌ విత్తనం నుంచి కొనుగోలు వరకు భరోసా

Show comments