సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య విబేధాల వెనుక కథ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సౌమ్యులుగా పేరున్న నటుడు కృష్ణ, గాయకుడు బాలసుబ్రమణ్యం మధ్య విభేదాలతో చాలా రోజులు కృష్ణ గారి సినిమాలకు బాలుగారు పాడలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. బాలుగారు గాయకుడిగా నిలదొక్కుకుంటున్న తొలిరోజుల్లో బాగా సపోర్టు చేసిన కృష్ణ గారితో మనస్పర్ధలు రావడమంటే మరీ ఆశ్చర్యం అనిపిస్తుంది.

బాలు మద్రాసులో నేపధ్య గాయకుడిగా ప్రవేశించిన తొలిరోజుల్లో గాయకుడు రామకృష్ణ బాగా పాపులర్ గాయకుడిగా ఉండేవాడు. అగ్రనటులు రామారావు, నాగేశ్వరరావు రామకృష్ణతోనే పాడించుకునే వాళ్ళు. అది చూసి శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి వారు కూడా రామకృష్ణనే కోరుకోవడంతో రాజబాబు లాంటి కమేడియన్ల పాటలే బాలుగారికి వచ్చేవి. తన గొంతుని చిత్రవిచిత్రంగా మార్చి బాలు పాడే పాటలు కమేడియన్ల మీద బాగా పేలేవి.

కొంతకాలం చూసి, పరిస్థితి మెరుగు పడితే ఉందాం, లేదంటే సినిమా రంగాన్ని వదిలేసి ఎక్కడైనా ఉద్యోగం చూసుకుందాం అనుకొంటున్న దశలో కృష్ణగారు తన సినిమాలు అన్నింటికీ బాలు గారితో పాడించి అండగా నిలిచారు. క్రమేపీ రామకృష్ణ కనుమరుగై, బాలుగారు తిరుగులేని స్థాయిలో నిలబడ్డారు.

కృష్ణగారితో మనస్పర్ధలు.

కష్టాలు పడి పైకి ఎదిగినందువల్లనేమో బాలుగారు డబ్బు విషయంలో కచ్చితంగా ఉంటారు. పారితోషికాల విషయంలో పెద్ద పట్టింపు లేకపోయినా తనకు రావలసిన, తను ఇవ్వవలసిన డబ్బుల విషయంలో కొంచెం నిక్కచ్చిగా ఉంటారని ఆయన గురించి తెలిసిన వారంటారు. ఒకసారి ఎందుకో డబ్బు అవసరం వచ్చి, కృష్ణగారి సంస్థ పద్మాలయా వారు తనకు ఉన్న బకాయి గురించి సంస్ధ క్యాషియర్ కి ఫోన్ చేసి గుర్తు చేశారు బాలుగారు. ఆ క్యాషియర్ కృష్ణగారితో “బాలసుబ్రమణ్యం ఫోన్ చేశారు సార్. పాత అకౌంట్ సెటిల్ చేస్తే తప్ప కొత్త పాటలు పాడనని చెప్పారు” అని చెప్పాడు. “సరే ఒకసారి లెక్కలు చూసి డబ్బులు పంపెయ్” అని చెప్పిన కృష్ణ గారు ఆ తరువాత చాలా రోజులు బాలుతో పాడించుకోలేదు.

అప్పటికప్పుడు రాజ్ సీతారాం అనే గాయకుడిని తీసుకొచ్చి తన సినిమాలు అన్నిటికీ అతనితో పాడించసాగారు కృష్ణగారు. దర్శక నిర్మాతలు, అభిమానులు బాలు గొంతు లేకపోవడం జీర్ణించుకోలేకపోయినా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చివరకు కృష్ణగారి దర్శక నిర్మాణంలో తెలుగు, హిందీ భాషల్లో వచ్చిన భారీ బడ్జెట్ సింహాసనం సినిమాక బప్పీలహరి ఇచ్చిన అద్భుతమైన ట్యూన్లు బాలుగారి గొంతు లేక అంత గొప్పగా కనిపించకపోయినా కృష్ణగారు వెనుకాడలేదు.

రాజ్ కోటీల రాయబారం

ఇదిలా ఉండగా ఒకసారి కృష్ణగారి సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం రాజ్-కోటి ద్వయానికి వచ్చింది. మా పాటలు బాలుగారే పాడాలి అని కృష్ణ, బాలు గార్ల మధ్య సంధి చేయడానికి నడుం కట్టారు. బాలుగారి వద్దకు వచ్చి విషయం చెప్పి, “ఈ సినిమాకు మీరు పాడాలి సార్. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కృష్ణ గారిని ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడి ఇష్యూ క్లియర్ చేసేలా చేస్తాం” అన్నారు.

“ఆయన్ని ఎక్కడికో పిలవడం ఎందుకు. మనమే వారి దగ్గరకు వెళ్దాం” అన్నారు బాలుగారు. ముగ్గురు పద్మాలయా స్టూడియోలోని కృష్ణగారి ఆఫీసుకు వెళ్ళారు. బాలుగారిని చూడగానే,” ఏం బాలూ బావున్నావా. కూర్చో”అన్నారు కృష్ణగారు.” సార్ అసలేం జరిగిందంటే….. “అని ఏదో చెప్పబోయారు బాలు.

కృష్ణగారు ఏమీ మాట్లాడకుండా టేబుల్ సొరుగులో నుంచి చెక్ బుక్ తీసి, ఒక చెక్ మీద సంతకం చేసి, బాలు చేతిలో పెట్టి, “కొత్త సినిమా మొదలు పెడుతున్నాం. ఇది అడ్వాన్స్ “అన్నారు.

అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం బాలుగారికి, వినే అవకాశం కృష్ణ గారికి లేకుండా ఆ గొడవ అలా సమసిపోయింది. ఆ తర్వాత కృష్ణగారు నటించడం అపేవరకూ బాలుగారే వారికి నేపధ్యగానం అందించారు.

(ఇది వివిధ సందర్భాలలో మీడియాతో తన స్వయంగా బాలసుబ్రమణ్యం గారి వెర్షన్. కృష్ణ గారి వెర్షన్ బయటకొచ్చే అవకాశం లేదు.)

జూన్ 4 గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జన్మదినం.

Show comments