Rayalaseema JAC – అటు అమరావతి పాదయాత్ర – ఇటు రాయలసీమ ధర్నా

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అలాగే పరిపాలన వికేంద్రీకరణ కు సంబంధించి ఆసక్తికర చర్చలు పలు రూపాల్లో జరుగుతున్నాయి. అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని అధికార పార్టీ తిప్పికొడుతూ రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతూ మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గగా ఆ తర్వాత అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినట్లుగా, అలాగే అక్కడి రైతులు విజయం సాధించినట్లుగా కొన్ని వర్గాలు ప్రచారం చేయడం మొదలు పెట్టాయి.

అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేయడం, పాదయాత్ర చేస్తున్న క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ ప్రాంత రైతుల విజయంగా చెప్పుకునే ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు చేయడం, మీడియాలో కాస్త హడావిడి చేయడం అనేది తరచుగా జరుగుతూ వస్తోంది. అయితే ఇక్కడ కీలకమైన మరో అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయి అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ప్రధానంగా రాయలసీమ అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ సహా కొన్ని పక్షాలు ఏమాత్రం కూడా లెక్కలేని తనంగా వ్యవహరించడాన్ని ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కొందరి మాట.

అమరావతి రైతుల పాదయాత్ర త్వరలో తిరుమలకు చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో రైతులు పాదయాత్ర విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్ళగా బహిరంగ సభ విషయంలో కూడా దాదాపుగా ఇదే వైఖరితో వ్యవహరించారు. ఈ నెల 14న అమరావతి పాదయాత్ర ముగింపు బహిరంగ సభను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్న తరుణం లో ఇక్కడ మరో కీలక ప్రకటన వచ్చింది.

ఈ నెల 13న విజయవాడలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక బహిరంగ సభను నిర్వహించేందుకు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సిద్ధమైంది. రాయలసీమ ధర్మ దీక్ష పేరుతో విజయవాడలోని ధర్నాచౌక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ దీక్షలో పలు కీలక అంశాలను సదరు వేదిక ప్రస్తావించనుంది. కర్నూలులో కృష్ణ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడంతో పాటుగా పలు డిమాండ్లను మరోసారి తెరపైకి తీసుకు వస్తోంది.

కర్నూలు జిల్లాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, మచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, వెలిగొండ, సిద్దాపురం ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడ ధర్నా చౌక్ లో దీక్షను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ దీక్షలో మూడు రాజధానులు అనే అంశం తెరపైకి వస్తుందా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత లేకపోయినా అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర ముగించడానికి ముందు రోజు ఈ దీక్షను ఏర్పాటు చేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : Galla Jayadev – అమరావతి పాదయాత్ర ముగింపు సభలో ఆ ఎంపీ పాల్గొనేనా ?

Show comments