Idream media
Idream media
చిన్న వయసులోనే పునీత్ రాజ్‌కుమార్ చనిపోవడం విషాదం. కోవిడ్ నుంచి కోలుకుంటున్న కన్నడ పరిశ్రమకి పెద్ద దెబ్బ. ఆయన సినిమాలు ఎక్కవ చూడలేదు కానీ , యూట్యూబ్ వీడియోలు చూస్తున్నపుడు మంచి మనిషి, సామాజిక సేవని ఇష్టపడే వ్యక్తి అని అర్థమవుతుంది. ఆయన తండ్రి రాజ్‌కుమార్ మా కాలం పెద్ద హీరో. మా వూళ్లో NTR, ANRకి సమానుడు.
రాయదుర్గం ఒకప్పుడు బళ్లారి జిల్లాలో భాగం. కన్నడం ఎక్కువ మాట్లాడేవారు. చిన్నప్పటి నుంచి వినడం వల్ల నాకూ అర్థమయ్యేది. కొద్దిగా మాట్లాడేవాన్ని. కన్నడ హిట్ సినిమాలు థియేటర్‌కి వచ్చేవి. చూసిన మొదటి సినిమా సంపత్తిగె సవాల్.భలే నచ్చింది. నాలుగైదుసార్లు చూసాను. తరువాత బంగారుద మనుష్య, గందదగుడి, 1978లో వచ్చిన శంకర్‌గురు పెద్ద హిట్.
రాజకీయాల్లోకి వచ్చారు కానీ, స్థిరంగా వుంటే గ్యారెంటీగా ముఖ్యమంత్రి అయ్యేవారు. కొంత కాలం కన్నడ ఉద్యమం నడిపారు. ప్రతి థియేటర్‌లో కన్నడ సినిమాలు గ్యారెంటీగా సంవత్సరంలో సగం రోజులు ప్రదర్శించాలని, మిగిలిన భాషల సినిమాల కంటే తక్కువ రేట్లు వుండాలని ప్రభుత్వంతో అమలు చేశారు. వీరప్పన్ కిడ్నాప్‌కి గురి కావడం ఒక విషాదం. ఆ విషయంపై ఒక పుస్తకం రాసి వుంటే అదో చరిత్ర అయ్యేది.
పునీత్ రాజ్‌కుమార్ 1983లో వచ్చిన భక్తప్రహ్లాదలో బాలనటుడిగా నటించాడు. కపాలి థియేటర్‌లో (బెంగళూరు) చూద్దామని అనుకున్నా, కానీ పక్కన వున్న గంగారామ్ బుక్‌స్టోర్ కూలిపోయి థియేటర్‌పై పడింది. దాంతో బెంగళూరు వెళ్లాలనిపించలేదు.
అప్పట్లో రాజ్‌కుమార్ హిట్స్ అన్నీ తెలుగులో వచ్చేవి. తెలుగులో హిట్స్ (ఆంధ్రావాలా, అమ్మానాన్న, ఓ తమిళ అమ్మాయి) కన్నడలో పునీత్ తీసాడు. వాళ్ల నాన్నలాగే పునీత్ కూడా గాయకుడు. రోజూ వ్యాయామం చేసే పునీత్ గుండె పోటుకి గురి కావడం ఆశ్చర్యం, విషాదం.
ఒకప్పటి రాజ్‌కుమార్ అభిమానులైన మాలాంటి వాళ్లకి షాక్. ఆయన ఆత్మకి శాంతి కలగాలి.
Also Read : Puneeth Rajkumar No More – షాకింగ్ : Mage కన్నడ పవర్ స్టార్ ఇక లేరు