Idream media
Idream media
మీరు చదువుతున్నది నిజమే. పంజాబ్ శాసన సభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కరోనా ఏ మాత్రం కారణం కాదు. రవిదాస్ జయంతి సందర్భంగా ఎన్నికలు వారం రోజుల పాటు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన ఎన్నికలు.. 20వ తేదీన జరుగనున్నాయి.
ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస్ జయంతి. ఆ రోజున లక్షలాది మంది పంజాబీలు వారణాసిలోని గురు రవిదాస్ జన్మస్థలమైన సీర్ గోవర్థన్ దేవాలయాన్ని సందర్శిస్తారు. పోలింగ్ 14వ తేదీ కావడంతో.. వారణాసికి వెళ్లి రావడం సాధ్యం కాదని, ఫలితంగా లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతారని కాంగ్రెస్ సహా బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళిదల్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి.
Also Read : ఎన్నికలు వాయిదా వేయండి… ఎన్నికల సంఘానికి పంజాబ్ సీఎం లేఖ
సీఎం చన్నీ కూడా ఈ నెల 13వ తేదీన ఎన్నికల వాయిదా విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అందరి వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ.. కొత్త తేదీని కూడా ప్రకటించింది.
పంజాబ్ సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల తొలి నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీన వెలువడింది. మొదటి దశలో కేవలం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో ఉత్తరప్రదేశ్‌తోపాటు గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరగనుంది. తాజా సవరణతో.. కేవలం పంజాబ్‌లో మాత్రమే పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీన జరగనుంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read : లక్ష్యంలో వ్యత్యాసం ఉంది.. ఫలితం ఎలా ఉండబోతోంది..?