ఏపీ విభ‌జ‌న స‌రిగా జ‌ర‌గ‌కే ఈ ప‌రిస్థితులు : ప్రధాని మోడీ కీల‌క వ్యాఖ్య‌లు

మార్చి ఒక‌టి.. 2014 ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం రాష్ట్రపతి అంగీకారాన్ని పొంది అధికారికంగా గెజిట్‌లో న‌మోదైన రోజు. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రం రెండు ముక్క‌లైన రోజు. తెలుగు వాళ్ల‌ల్లో కొంద‌రికి బాధ‌.. మ‌రికొంద‌రికి సంతోషం నింపిన రోజు. స‌రిగ్గా నెల త‌ర్వాత అదే సంవ‌త్స‌రం జూన్ రెండున భారతదేశంలోని 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించింది. సుదీర్ఘ పోరాటం ఫ‌లించిన వేళ‌.. యావ‌త్ రాష్ట్రమంతా ఆనందంతో చిందేస్తుంటే.. రాజ‌ధానిని కోల్పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌పై నిశ్శ‌బ్ధం ఆవ‌హించింది. అయిన‌ప్ప‌టికీ అందుబాటులో ఉన్న వ‌న‌రులు, విభ‌జ‌న స‌మ‌యంలో పెద్దలు ఇచ్చిన హామీల‌పై ఆశ‌ల‌తో ముంద‌డుగు వేయ‌సాగింది. ఇప్పుడు తాజాగా విభ‌జ‌న నాటి ప‌రిస్థితుల‌ను పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోడీ లేవ‌నెత్త‌డం ఆస‌క్తిగా మారింది.

ఇప్ప‌టికీ క‌ష్టాల్లోనే..

కాంగ్రెస్ పార్టీపై సోమ‌వారం నిప్పులు చెరిగిన ప్ర‌ధాన‌మంత్రి మోడీ మంగ‌ళ‌వారం కూడా అదే పంథా కొన‌సాగించారు. అయితే.. ఏపీ విభ‌జ‌న‌పై కూడా ఆయ‌న తాజాగా స్పందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సంద‌ర్భంగా మంగళవారం రాజ్యసభలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల ఏర్పాటైన రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయని అన్నారు. ఆ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు.

హ‌డావిడిగా విభ‌జ‌న‌

ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. తాము తెలంగాణ కు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావులేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.

అలా చేస్తే ఈ ప‌రిస్థితి ఉండేది కాదు..

సరైన విధంగా విభజన జరిగి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు.

Also Read : పెరిగిన స్వరం : మోడీ.. పార్లమెంట్‌లో ఢీ..!

Show comments