హ్యాట్సాఫ్ హిమప్రియ : కాశ్మీర్ ఉగ్రదాడి- శ్రీ‌కాకుళం బాలిక సాహ‌సానికి నేడు పురస్కారం

ఆ బాలిక వ‌య‌స్సు ఎనిమిదేళ్లు. చిన్న అలికిడి అయితేనే.. సాధార‌ణంగా అమ్మ‌చాటుకు చేరే వ‌య‌సు. అలాంటిది తూటా చ‌ప్పుళ్లు వినిపిస్తే చిన్నారులు ఏం చేస్తారు.. భ‌యం భ‌యంగా త‌ల్లిదండ్రుల‌కు హ‌త్తుకు పోతారు. కానీ.. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ఓ బాలిక సాహ‌సం వింటే ఆశ్చ‌ర్య‌పోతారు. తండ్రి వార‌స‌త్వ‌మో.. చిన్న వ‌య‌సులోనే ఆమెకు అంత తెగువ ఎలా వ‌చ్చిందో కానీ.. బాలిక సాహ‌సానికి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌మ‌క్షంలో వ‌ర్చువ‌ల్ గా పుర‌స్కారం అందుకోనుంది.

బాలిక ఏం చేసిందంటే..

జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్‌పై 2018 ఫిబ్రవరి 10 ఉదయం ఐదు గంటల సమయంలో ఉగ్ర‌మూక దాడి చేసింది. తూటాల వ‌ర్షం కురిపించింది. అదమరిచి నిద్ర పోతున్న మనుషులంతా ఉలిక్కిపడి లేచారు. ఆ భీకర దాడిలో ఓ బాలిక అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఆర్మీ జవానైన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటివారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె పేరు గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి. తండ్రి పేరు గురుగు సత్యనారాయణ. ఆర్మీ జవాన్‌. ఈ దాడి సమయంలో ఆయన అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం రూరల్‌ మండలం, పొన్నాం గ్రామం. ఈ సాహసాన్ని అప్పట్లోనే కేంద్రం గుర్తించింది.

రాష్ట్రీయ బాల పురస్కార్ కు ఎంపిక

హిమప్రియ ధైర్యసాహసాలు తెలుసుకున్న నాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్‌కు వెళ్లి, హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. ఇప్పుడు ఆ బాలికకు ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు ప్రకటించినట్టు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది గురుగు హిమప్రియ ఎంపికైంది. బాలిక ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వర్చువల్‌ విధానంలో ధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకోనుంది.

ఆర్మీ పుస్త‌కంలో ఆమె సాహ‌సం

ఈ కార్యక్రమం నేటి ఉదయం 11.30 గంటల నుంచి వెబ్‌ కాస్ట్‌ ద్వారా హెచ్‌టీటీపీఎస్‌://పీఎంఇండియా వెబ్‌కాస్ట్‌.ఎన్‌ఐసీ.ఇన్‌/ లేదా దూరదర్శన్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాఠశాల/కళాశాలల విద్యార్థులు వీక్షించాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ విజ్ఞప్తి చేశారు. హిమప్రియ 2019లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఆర్మీకి సంబంధించిన ఓ పుస్తకంలో ఆమె ధైర్యసాహసాలను వివరిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. నాటి ఘటనలో బాలిక తల్లికి చేయి పూర్తిగా దెబ్బతింది. హిమప్రియ భుజానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హిమప్రియ పూణేలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెవెన్త్‌ చదువుతోంది.

Show comments