రైతులకు మోదీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తం జమ

ఖరీఫ్‌ సాగు వేళ మోదీ సర్కార్‌ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ రోజు నుంచి ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం (పీఎం కిసాన్‌) నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మేరకు 9వ విడత నగదును రైతులు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. రైతులకు రెండు వేల రూపాయల చొప్పన 9.75 కోట్ల మందికి ఆర్థిక ప్రయోజనం చేకురుతోంది. మొత్తం మీద 9వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 19,500 కోట్ల రూపాయలు జమ చేయబోతోంది.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం పేరిట నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్‌ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఆరు వేల రూపాయలు ఏడాదిలో మూడుసార్లు అందిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ రోజు విడుదల చేసిన సొమ్ముతో కలిపి మొత్తం 9 సార్లు రైతులకు రెండు వేల రూపాయల చొప్పన అందించారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.60 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

9వ విడత నగదు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా సమయంలో రైతులు సేవలు అనన్యమైనవిని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశ యవనికపై మన వ్యవసాయం, రైతులు కీలక భూమిక పోషిస్తారని అంచనా వేశారు. పీఎం కిసాన్‌ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. మునుపెన్నడూలేని విధంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, తద్వారా ఈ ఏడాది 1.70 లక్షల కోట్ల రూపాయుల రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిలో మొదటిసారి ప్రపంచంలోనే మన దేశం మొదటి పది స్థానాల్లో నిలిచిందని తెలిపారు.

Also Read :  కేంద్రం ఫోటో సరే…. మరి కేంద్ర నిధుల మాటేంటి…

Show comments