Idream media
Idream media
ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు వియ్యంకులు అయిన వారి జాబితా తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. వైసీపీ కి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నెల 20న (శనివారం) వియ్యంకులు కాబోతున్నారు. అందులో ఒకరు గతంలో మంత్రిగానూ పని చేసిన వారు కాగా.. మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన నేత.
వారు ఎవరో కాదు.. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌లు. కొలుసు పార్థసారధి ఏకైక కుమారుడు నితిన్ కృష్ణ, బుర్రా మధుసూదన్ యాదవ్ ఏకైక కుమార్తె అమృత భార్గవిల వివాహం ఈ నెల 20వ తేదీన విజయవాడలో జరగబోతోంది. కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో వీరి వివాహం జరగబోతోంది.
కొలుసు పార్థసారధి కృష్ణా జిల్లాలో యాదవ సామాజికవర్గంలో బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆయన తండ్రి కొలుసు పెద్దరెడ్డయ్య యాదవ్ రాజకీయ వారసత్వాన్ని పార్థసారధి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పెద్ద రెడ్డయ్య యాదవ్ 1991లో తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారధి తొలిసారి 2004లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read : కనిగిరి ఎమ్మెల్యే సీఎం జగన్ నమ్మకాన్ని ఎలా గెలుచుకోగలిగారు..?
2004లో ఉయ్యూరు నుంచి తొలిసారి గెలిచిన పార్థసారధి 2009లో పెనమలూరు నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో పశుసంవర్థక, మత్య, పాఠశాల విద్యా శాఖల మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున మచిలీపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో మళ్లీ పెనమలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్ బిల్డర్‌గా బెంగుళూరులో వ్యాపారం చేస్తూ.. వైసీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. స్థానికేతరుడు కావడం, అంతకుముందు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరిబాబూరావు నామినేషన్ చెల్లకపోవడం వల్ల వచ్చిన సానూభూతి బుర్రా ఓటమికి కారణాలయ్యాయి. 2014 ఎన్నికల తర్వాత కనిగిరిలోనే ఇళ్లు నిర్మించుకున్న బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానికేతరుడు అనే ముద్రను తొలగించుకున్నారు. ఐదేళ్లు నిత్యం ప్రజల్లో ఉండి వారి అభిమానం గెలుచుకున్నారు. కనిగిరి చరిత్రలో ఎవరికీ రాని విధంగా 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. మధుసూదన్ యాదవ్‌ను టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా నియమించారు.