Idream media
Idream media
చేగువేరా, భగత్ సింగ్ చిత్రాలతో పాటు పిడికిలి బిగించి రాజకీయ యవనిక మీదకు ఉవ్వెత్తున దూసుకొచ్చింది జనసేన పార్టీ. జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనలు, విప్లవ భావనలకు ఆకర్షితులైన యువత భారీ సంఖ్యలో ఆయనకు మద్దతు పలికారు. ఆరంభంలో అన్నను మించిన ఊపు తెచ్చారు పవన్. పార్టీ పెట్టిన అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి, దేశంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆయన మద్దతుతో ఏపీలో టీడీపీ గెలిచినా జనసేనకు మాత్రం అది మైనస్ గానే మారింది. పార్టీ పెట్టిన వెంటనే పోటీ ఎవరికైనా సాధ్యం కాదు. అలాంటప్పుడు మంచి నాయకులను ఎన్నుకోవాలని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి , ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా ఉంటే కథ వేరేలా ఉండేది. ఆదిలోనే టీడీపీతో అంటకాగడం పవన్ ను నేటికీ వెంటాడుతూనే ఉంది.
తర్వాతి ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా.. గెలిస్తే మళ్లీ టీడీపీ గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచార ఫలితమో ఏమో కానీ ప్రజలు జనసేనను ఆదరించలేదు. పవన్ ను కూడా పట్టించుకోలేదు. ఈ అనుభవంతో పవన్ తెలంగాణ వైపు చూసే సాహసం చేయలేదు. ప్రస్తుతం మళ్లీ ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కొన్నిచోట్ల కాస్త పుంజుకుంది. పవన్ ప్రచారం లేకపోయినా జనసైనికులు పోరాడి కొన్ని చోట్ల విజయం సాధించారు. ఒకటి ఆరా అయినప్పటికీ.. గతంతో పోల్చుకుంటే మెరుగు కావడం జనసైనికుల్లో ఉత్సాహం నింపింది. దీనిని బట్టి జనసేన ఆశావాదం వైపు జనాలు చూస్తున్నారని లెక్కలు కడుతున్నారు.
అయితే.. పార్టీని పటిష్ఠం గా ముందుకు నడిపించాల్సింది నాయకుడే. ఆ పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ ఎలా నిలబడతారనేది జనసేనలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిస్థితులు, సమయం, సందర్భానికి అనుగుణంగా కేవలం జనసేనను అధికారంలోకి తీసుకురావడం కోసమే రాజకీయాలు చేస్తే కాస్త అయినా మెరుగుపడే అవకాశాలు ఉండొచ్చు. అలా కాకుండా ఇప్పుడు కూడా ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న భావన కానీ, టీడీపీతో కలిసి అధికారంలోకి రావాలన్న ఆలోచనలు కానీ ఉంటే కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ ఇవ్వగలుగుతామని జనసైనికులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. మరి వారి ఆశలను జనసేనాని ఎంత వరకు నెరవేరుస్తారో వేచి చూడాలి.
Also Read : TDP, Chandrababu, Mudragada – బాబు ఆశలకు ముద్రగడ గండి..!