Vizag steel plant – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ – పవన్ దీక్ష

ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి కాస్త తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ హడావుడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ కోణంలో కూడా విమర్శించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి రాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమ కు సంబంధించి తమ పార్టీ పోరాటం చేస్తోంది అని చెబుతూనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వంను మాత్రం ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేదు.

అదేవిధంగా జనసేన పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా కేవలం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ పోరాటం చేసే ప్రయత్నం చేస్తోంది. గత నెలలో విశాఖ లో బహిరంగ సభ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఉద్యోగులకు మద్దతు ఇచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పవన్.

ఇక భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటూనే ఎల్లుండి మంగళగిరిలో దీనికి సంబంధించి దీక్ష చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీతో ఒకపక్క రాజకీయంగా కలిసి ప్రయాణం చేస్తూ ఈ దీక్షలు బహిరంగ సభల ద్వారా కార్యకర్తలను కూడా ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దాదాపు ఏడాది నుంచి ప్రైవేటు రంగానికి అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వం… విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా దాదాపుగా నాశనం చేసే విధంగా ప్రక్రియను వేగవంతం చేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలు సందర్భాల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను కచ్చితంగా విక్రయిస్తామని చెప్పడం చాలా వరకు కూడా ఆశ్చర్యపరచిన అంశం.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గానీ ఎక్కడా కూడా కేంద్రాన్ని పార్లమెంట్ సమావేశాల్లో గాని బయటగాని విమర్శించే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలతోనే కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం ఉండేది.

రైతు చట్టాల విషయంలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో రైతులు ఉద్యమానికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం విశాఖ పరిశ్రమ విషయంలో ఇదే విధంగా రాజకీయ పార్టీలు నిజాయితీగా పోరాటం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసినా చేయకపోయినా రాష్ట్రంలో ఉన్న ఇతర విపక్షాలు అన్నీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం కచ్చితంగా ఫలితం ఉండేది. ఒకపక్క భారతీయ జనతా పార్టీతో రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు రంగానికి అప్పగించవద్దని పోరాటం చేయడం మాత్రం విస్మయానికి గురిచేస్తున్న అంశం.

Also Read : Vizag Railway Zone, Central Govt. – విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం తడవకో మాట ఎందుకు చెబుతోంది..?

Show comments