Idream media
Idream media
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చైర్మన్.. ఇలా ఆయన అనుభవించని పదవి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగారు. అపార రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం తిప్పలు మొదలయ్యాయి. ఆయనే ఎల్.రమణ. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయాలు రమణకు ఆశనిపాతంగా మారేవి. అయినప్పటికీ, ఎవరున్నా, లేకున్నా టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు ఏమైనా ఆయనే అభ్యర్థి. ఓటమి పాలవుతున్నా బాబు ఒత్తిడితో నిలబడక తప్పేది కాదు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అన్ని రకాలుగానూ ఓటమి చెందారు. అంతటి అయోమయ పరిస్థితుల్లోనూ పార్టీలో అంతర్గత విభేదాలతో అందరూ పోయినా రమణ మాత్రం టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. చివరకు పార్టీ టీఆర్ఎస్ లో అంతర్ధానం అయిపోయాక.. ఎట్టకేలకు రమణ కూడా టీడీపీని వదిలేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న రమణ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరాడు. టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకొచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏ ఎన్నికల్లో నిలబడినా ఓటమే ఎదురైంది. ఆయన ఒంటరి పోరాటం ఫలించలేదు. దిగజారుడు రాజకీయాలకు రమణ పాల్పడలేదనే అభిప్రాయం ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీపై ఉన్న అభిప్రాయం మేరకు ప్రజలు రమణను ఆదరించలేదు.రాష్ట్రం ఆవిర్భవించిన ఏడేళ్ల తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు.
అధికార పార్టీ కావడంతో మళ్లీ రమణ రాజకీయంగా వెలుగొందే అవకాశం వచ్చిందని అందరూ భావించారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనను అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ప్రకటనతో రమణ ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని సంబరపడ్డారు. కానీ ఏకగ్రీవం కోసం టీఆర్ ఎస్ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లాలోని రెండు స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు పార్టీ ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఈ నెల 10న ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భాను ప్రకాశ్ పోటీ చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పై తిరుగుబావుటా ఎగరేసి పార్టీకి రాజీనామా చేసిన సర్దార్ రవీందర్ సింగ్ తో సహా మొత్తం 10 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీగా గెలిచేందుకు కూడా రమణ శ్రమించాల్సి వస్తోంది. అధికార పార్టీలో చేరినా గెలుపు కోసం రమణ ఎదురీదక తప్పడం లేదనే చర్చ జరుగుతోంది.