Modi pm ,cm’s- మోదీ స‌ర్కార్ పై ఫైర్ అవుతున్న‌ ముఖ్య‌మంత్రులు

ఈ మధ్య ఒక ఇంటర్నేషల్ సర్వే మోదీ సార్ గ్రేట్ అని ప్ర‌క‌టించింది. కానీ దేశంలో మాత్రం ఆయ‌న గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది. అలాగే కేంద్రం తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వారి జాబితా కూడా పెరుగుతోంది. కొవిడ్ కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌, రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. మోదీ స‌ర్కారుపై ఫైర్ అవుతున్న ముఖ్య‌మంత్రుల సంఖ్య పెరిగింది. ప్ర‌ధాన‌మంత్రిగా తొలిసారి పాల‌న సాగించిన ఐదేళ్ల‌లో ఎప్పుడూ ఈ త‌ర‌హా ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వంపై కొవిడ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ విమ‌ర్శ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రులు పెరుగుతూ వ‌స్తున్నారు. నూత‌న‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల అనంత‌రం బ‌య‌ట‌తో పాటు ఇంట కూడా కొంత వ్య‌తిరేక‌త‌ను మోదీ మూట‌గ‌ట్టుకున్నారు. అనంత‌రం ప్రైవేటీక‌ర‌ణ విధానాలపై ఏపీ వంటి రాష్ట్రాలు కూడా నిర‌స‌న గ‌ళం ఎత్తాయి.

కొవిడ్‌కు ముందు డిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని కూటమి మోదీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి కనిపించింది. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఆ రాజకీయ యుద్ధం కాస్త తగ్గినా ఇప్పుడు కూడా ఉప్పు, నిప్పు గానే వాతావ‌ర‌ణం ఉంది. ఇక పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మోదీ స‌ర్కారుపై ఆమె ఒంటికాలిమీద లేస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డానికి పెద్ద యుద్ధ‌మే చేస్తున్నారు. అచ్చేదిన్ అంటే ఇదేనా..అంటూ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. ద్రవ్యోల్బణం, గ్యాస్ సిలిండర్, చమురు ధరలు, జీఎస్టీ.. ఇలా ప‌లు అంశాల‌పై నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్ కూడా కొవిడ్ కాలంలో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలు కూడా రాశారు. అన్ని అంశాలను తన గుప్పెట్లో పెట్టుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని,రాష్ట్రాల సీఎంలను అవమానిస్తోందని విమర్శించారు. ఝార్ఖండ్ సీఎం మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్ అయితే వివాదాస్ప‌దంగా మారింది. డిల్లి,కేరళ, తమిళనాడు, ఝార్ఖండ్,చత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్, ఇప్పుడు తెలంగాణ‌.. ఇలా కేంద్రంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రాష్ట్రాల జాబితా పెరుగుతోంది.

సౌతిండియా తీసుకుంటే ఈ ఏడాది మేలో తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ అయితే మోదీ సర్కార్ మీద బాగానే విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. నీట్ పరీక్షల నుంచి ఏ అంశాన్ని కూడా ఆయన అసలు విడిచిపెట్టడంలేదు. ఇపుడు కేసీఆర్ కూడా తీవ్ర‌స్థాయిలో యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మరో వైపు చూస్తే కేరళ సీఎం పినరయ్ విజయన్ ఎటూ కమ్యూనిస్ట్ నేత. ఇలా దక్షిణాదిన ఉన్న అయిదు రాష్ట్రాల్లో మూడింట కమలానికి రెడ్ సిగ్నల్స్ పడిపోయాయి. ఇక మిగిలింది బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటక. అక్కడ కూడా కాంగ్రెస్ జనతాదళ్ బాగానే పుంజుకుంటున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్ర‌త్యేక హోదా త‌దిత‌ర అంశాల‌పై ఏపీ ప్ర‌భుత్వం కూడా మోదీ స‌ర్కారుపై పోరాటం చేస్తోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు కాస్త అటూ, ఇటూ అయితే.. నిర‌స‌న స్వ‌రాలు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Also Read : KCR Press Meet – ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ ధరలు.. కేంద్రాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్

Show comments