Idream media
Idream media
తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ లో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచే.. అక్కడ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికల సంగ్రామానికి సై అంటున్నాయి. నెలలకు ముందు నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు రెఢీ అయ్యాయి. ప్రధానంగా బీజేపీ అయితే నియోజకవర్గంలో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా యాక్టివ్ అయింది. మొత్తంగా అధికార పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణలోని ప్రతిపక్షాలు గట్టి కసరత్తునే చేస్తున్నాయి. మరి ఏపీలో పరిస్థితి చూస్తే.. అందుకు విరుద్ధంగా ఉంది.
ఏపీ అధికార పార్టీపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు స్టేట్ మెంట్లు, ట్వీట్లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. పార్టీలన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి కానీ వైసీపీ ని ఢీ కొట్టి నిలవలేకపోతున్నాయి. కాంగ్రెస్ అయితే అసలు ఎప్పటినుంచో ఉనికిలో లేదనుకోండి. ఇక టీడీపీ, బీజేపీ కూడా అప్పుడప్పుడు ఆందోళనలు మినహా ప్రజాక్షేత్రంలో రాణించలేకపోతున్నాయి. ఎన్నికల్లో పోటీకి దిగుతున్నా పరాజయం పాలవుతున్నాయి. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని టీడీపీ పలు కార్యక్రమాలకు పిలుపు ఇస్తోంది కానీ కార్యాచరణలో జోష్ కనిపించడం లేదు. అందుకు బద్వేల్ ఉప ఎన్నికే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కానీ.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే నాథులు కనిపించడం లేదు.
Also Read : బద్వేలులో జనసేన బాబు వెంట వెళుతుందా..? బీజేపీతో ఉంటుందా..?
ఎన్నిక ఏదైనా అధికార పార్టీకి అక్కడ తిరుగు ఉండడం లేదు. పైగా బద్వేల్ గత ఎన్నికల్లో వైసీపీదే. ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ పోయిన పరువును బద్వేల్లో నిలబెట్టుకోవాలని అధిష్ఠానం తాపత్రయ పడుతున్నా.. స్థానికంగా అసలు పార్టీ ప్రచారం కనిపించడం లేదు. బీజేపీ, జనసేన పార్టీలు అయితే.. అసలు పోటీ చేస్తాయా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా, బీజేపీ అతిరథమహారథులు వచ్చినా ఆ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పోటీ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలను పార్టీలోని కొందరు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీలో ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నట్లు గా కనిపిస్తోంది. హుజూరాబాద్ లో హోరాహోరీగా ప్రచారం చేస్తుంటే.. ఏపీలో మాత్రం అధికార పార్టీ మినహా విపక్షాలు కనిపించడం లేదు. మరి మున్ముందు పరిస్థితి ఎలా ఉండనుందో వేచి చూడాలి.
Also Read : వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2001 బద్వేల్ ఉప ఎన్నిక గురించి తెలుసా..?