NGT Orders – పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ కీలక ఆదేశాలు

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించింది. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపాలని.. అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదని.. అటవీ, పర్యావరణ శాఖ నుంచి తీసుకున్న అనుతులేవీ తమ ముందు కనిపించలేదని ఎన్జీటీ పేర్కొంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు సబబుగానే ఉన్నాయని తెలిపింది. ఆయా అభ్యంతరాలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని పేర్కొంది.. అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి పనులు చేపట్టేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. అంత వరకు పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయాలని ఆదేశించింది.

ఏపీ అభ్యంతరాలు ఇవీ..

కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ 1, 2లోనూ పాలమూరు-రంగారెడ్డికి కేటాయింపులు లేవని.. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో కూడా ఈ ప్రాజెక్ట్ లేదని ఏపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. పాలమూరు- రంగారెడ్డి నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం పడుతోందని రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు మినహా మిగిలిన ఏ ప్రాజెక్ట్ అయినా కొత్తదేనని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. శ్రీశైలం నుంచి 90టీఎంసీల నీటిని మళ్లించి కొత్త ఆయకట్టుకు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015 జూన్ 10న జీవో జారీచేసినట్లు అఫిడవిట్ ప్రస్తావించింది.

పర్యావరణ అనుమతుల నుంచి తప్పించుకునేందుకే తాగునీటి ప్రాజెక్ట్ పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ చేపడుతోందని ఏపీ ఆరోపించింది. ట్రైబ్యునల్ -2 చేసిన కేటాయింపులు, షెడ్యూల్ -11లోని ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత తేల్చాల్సి ఉందని.. ఇవేమీ జరగకుండా ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్లడం తగదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్జీటీ జోక్యం చేసుకుని పాలమూరు- రంగారెడ్డి పనులు నిలిపివేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరగా విచారణ చేసిన ఎన్జీటీ పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

Also Read : YCP MPs Meet CEC – టీడీపీ మొదలుపెట్టింది.. వైసీపీ ముగించింది..

Show comments