అందాలలో అహో మహోదయం..

జాతీయ స్థాయిలో బెస్ట్‌ టూరిజం ప్లేస్‌గా విశాఖపట్ట‌ణం అవార్డు ద‌క్కించుకుంది. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ తాజాగా ఈ అవార్డు ప్ర‌క‌టించింది. ఇప్పుడే కాదు.. విశాఖ‌ప‌ట్ట‌ణం ఎప్పుడూ బెస్టే. ప్ర‌పంచంలో దాగి ఉన్న అందాల‌న్నింటినీ విశాఖ త‌న‌లో ఇముడ్చుకుందంటే అతిశ‌యోక్తి కాదు. ఊటీని మైమ‌ర‌పించే లంబ‌సింగి.. సుంద‌రంగా ఆక‌ర్షించే సాగ‌ర తీరం.. ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచే కైలాస‌గిరి.. పారాసెయిలింగ్ అనుభూతుల్ని అందించే రిషికొండ ఇవ‌న్నీ విశాఖ సొంతం. స‌హ‌జ సిద్ధ సౌంద‌ర్యానికి కేరాఫ్ గా నిలిచే న‌గ‌రాన్ని ప‌ర్యాట‌కంలో అగ్ర‌భాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నింటినో చేప‌డుతుంది జ‌గ‌న్ స‌ర్కార్. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అయ్యేలా తీర్చిదిద్దుతోంది.

సాయంత్రం వేళ‌.. విశాఖలోని బీచ్ తీరం వైపు అడుగులు వేస్తే అంత‌టా కోలాహ‌లం క‌నిపిస్తుంది. ల‌క్ష‌లాది మంది ఆర్‌కే బీచ్‌కు రోజూ సంద‌ర్శ‌కులు వస్తుంటారు. ఈ నేప‌థ్యంలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్‌లు అభివృద్ధి చేసేందుకు వైసీపీ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్‌ఎస్‌ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్‌లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అవసరమైన వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్‌ కోర్టులు, ఫస్ట్‌ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్‌ రూమ్, సిట్టింగ్‌ బెంచీలు, సిట్‌ అవుట్‌ అంబ్రెల్లాలు, రిక్‌లైయినర్స్, చిల్డ్రన్‌పార్కులు, ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్, జాగింగ్‌ ట్రాక్, పార్కింగ్‌ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్‌ స్విమ్మింగ్‌ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్‌ స్పోర్ట్స్, వాచ్‌ టవర్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ కూడా రానున్నాయి.

Also Read : క‌రోనా స‌మ‌యంలో కూడా కుబేరుల సంప‌ద ఎంత పెరిగిందో తెలుసా..?

సరికొత్త సాహస క్రీడకు వేదిక‌గా విశాఖను మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్‌ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్‌ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్‌ చేసే అవకాశం కలగనుంది. దీంతో పాటు ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్‌ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి.

కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్‌ క్లాస్‌ టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ముఫ్పై కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్‌ కారిడార్‌ రూపుదిద్దుకోనుంది. దీంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేయ‌నుంది. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు ఇర‌వై కిలోమీటర్ల మేర ఆరు లైన్లు నిర్మించి భవిష్యత్తులో ఎనిమిది లైన్లుగా విస్తరించే ఏర్పాట్లు చేస్తోంది.

భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పర్యాటక ప్రాంతాలున్న విశాఖ‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి ప‌రిచేందుకు అన్ని చ‌ర్య‌ల‌నూ చేప‌డుతున్నారు. జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌ల‌ను వెచ్చిస్తోంది. అద్భుత న‌గ‌రం విశాఖ‌లో మున్ముందు మ‌రిన్ని అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి.

Also Read : ద్రాక్షారామం – మున్సిపాలిటి నుంచి పంచాయతీ స్థాయికి ఎందుకు పడిపోయింది?

Show comments