Nagam Janardhan Reddy Fires On Revanth Reddy: రేవంత్‌ రెడ్డి నమ్మకద్రోహి.. కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుందో చూస్తాను: నాగం జనార్థన్‌ రెడ్డి

రేవంత్‌ రెడ్డి నమ్మకద్రోహి.. కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుందో చూస్తాను: నాగం జనార్థన్‌ రెడ్డి

మరో నెల రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల సమరంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మిగతా పార్టీల కన్నా ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించడమే కాక.. వారికి బీఫారాలు అందచేసింది. అలానే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ప్రచారపర్వానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇక మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే అభ్యర్థుల ప్రకటనలు వెలువడుతున్న క్రమంలో అన్ని పార్టీల నుంచి అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు.

ఇక అభ్యర్థుల ప్రకటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే దీనిలో చాలా మంది సీనియర్లకు చోటు దక్కలేదు. దాంతో వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా తనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని, తనకే టికెట్ వస్తుందని ఆశించిన నాగం జనార్ధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆయనకు నాగర్‌ కర్నూల్‌ టికెట్ కేటాయించలేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన నాగం జనార్థన్‌ రెడ్డి.. రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

ఈ క్రమంలో నాగం మరో నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రేవంత్‌ రెడ్డి ఒక నమ్మకద్రోహి.. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్‌ కర్నూల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా గెలుస్తుందో నేను కూడా చూస్తాను. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన నాయకులు ఎంతోమందికి రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించాడు. మా లాంటి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాడు. మల్లు రవి, రేవంత్ రెడ్డి వాళ్ల ఎన్నికల కోసం నా ప్రచార రథాలు వాడుకున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Show comments