MLC, Murugudu Hanumantha Rao – జగన్‌ హామీ.. మురుగుడుకు కలిసొచ్చింది

రాజకీయాల్లో రాణించాలంటే కాలం కూడా కలిసి రావాలి. ఎంత పని చేసినా.. అన్ని బలాలు ఉన్న టైం కలిసి రాకపోతే.. తెరవెనుకే ఉండాల్సిందే. మరికొంత మంది నేతల రాజకీయ జీవితం ఇక ముగిసిందనే సమయంలో కాలం కలిసి వచ్చి మళ్లీ వెలుగులోకి వస్తారు. ఈ కోవకు చెందిన నేత మురుగుడు హనుమంతరావు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు గెలిచిన మురుగుడు.. వైఎస్‌ఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. ఆయన వియ్యపురాలు కాండ్రు కమలకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కింది. ఆమె విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ పరిణామాల్లో ఇక మురుగుడు రాజకీయ జీవితం ముగిసిందని అందరూ భావించారు.

Also Read : Ananta Uday Bhaskar, YCP Mlc Seat – అనంతబాబు సమర్థతకు ‘పెద్ద’పీట

2014 ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి చిరంజీవిపై స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడం, పైగా టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన రాజధాని ప్రాంతంలో మంగళగిరి ఉండడంతో.. భవిష్యత్‌ రాజకీయ అవసరాల దృష్ట్యా టీడీపీ మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఆప్కో చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌ టీడీపీ తరఫున, ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఇదే తనకు చివరి అవకాశమని, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, చేనేతలకే వైసీపీ టిక్కెట్‌ ఇస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న చేనేతలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ కూడా పార్టీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ పదవి చేనేత సామాజికవర్గాలనికి చెందిన నేతకు ఇస్తానని హామీ ఇచ్చారు.

జగన్‌ ఇచ్చిన ఈ హామీనే మురుగుడు హనుమంతరావుకు కలిసి వచ్చింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందనే నమ్మకంతోనే.. ఆయన రెండు నెలల క్రితం (సెప్టెంబర్‌ 23) టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కడం విశేషం. మొత్తం మీద మురుగుడు టైం బాగుందనే చెప్పాలి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా 2009లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కక.. పోటీకి దూరంగా ఉన్న మురుగుడుకు.. 2014లో టీడీపీ ప్రభుత్వంలో, తాజాగా వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన పదవులు దక్కడం గమనార్హం.

Also Read : Mlc,Raghu Raju – రఘురాజు కష్టానికి దక్కిన ఫలితం

Show comments