iDreamPost
iDreamPost
నిన్న లక్ష్య, గమనంతో పాటు విడుదలైన మరో సినిమా మడ్డీ. ఇండియాలో మొదటి మడ్ రేసర్ మూవీగా దీనికి గట్టి ప్రచారమే కల్పించారు. డాక్టర్ ప్రగభల్ దర్శకత్వంలో ప్రేమ కృష్ణదాస్ నిర్మించిన ఈ మూవీకి కెజిఎఫ్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం అందించడం విశేషం. పేరున్న క్యాస్టింగ్ లేకపోయినా ప్రమోషన్ మెటీరియల్ లో చూపించిన విజువల్స్ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. తెలుగు వెర్షన్ సురేష్ సంస్థ అందించడంతో అంచనాలు ఓ మోస్తరుగా లేకపోలేదు. అయితే ప్రచార లోపం వల్ల మడ్డీ వచ్చిందన్న సంగతి సామాన్య ప్రేక్షకులకు అంతగా చేరలేదు. పోనీ టాక్ ని బట్టి ఇదేమైనా సర్ప్రైజ్ హిట్ అయ్యే అవకాశం ఉందేమో రిపోర్ట్ లో చూద్దాం
కార్తీక్(రిధన్ కృష్ణ), ముత్తు(యువన్) అన్నదమ్ములు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. బద్ధ శత్రువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. బురదలో బళ్ళు నడిపే పందెంలో కార్తీక్ ఓసారి టోనీ కాలు పోవడానికి కారణం అవుతాడు. దీంతో అతను పగ తీర్చుకునేందుకు సిద్ధపడతాడు. ఈ క్రమంలో అతనిపై దాడి కూడా చేస్తాడు. సీన్ లోకి ముత్తు వస్తాడు. సోదరుడి మీదకు తెగబడుతున్న వాడికి బుద్ధి చెబుతాడా లేక వాడికి సహాయం చేసి తను సంతృప్తి చెందుతాడా అనేది అసలు కథ. బ్రదర్స్ మధ్య నెగటివ్ సెంటిమెంట్ ని వాడుకుని దర్శకుడు దీన్ని రూపొందించారు. ముందు వేరుగా ఉండి తర్వాత కలిసి విలన్ మీద తిరగబడటం అనే పాయింట్ కి మడ్ రేస్ ని జోడించారు
కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నా నడిపించిన విధానం స్లోగా ఉండటంతో మడ్డీ ఆశించిన విధంగా సాగదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్లు మరీ కృతకంగా ఉన్నాయి. రేసింగ్ ఎపిసోడ్స్ నుంచి ఏదో ఆశిస్తాం కానీ అవి కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. ఇదేదో స్పెషల్ అనే ఫీలింగ్ పెద్దగా కలగదు. ఫస్ట్ హాఫ్ నెమ్మదికే విసుగు వస్తుంది. ఇంటర్వెల్ దగ్గరే కాస్త పికప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సహనానికి పరీక్ష మొదలు. రవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కటే కొంత బెటర్ గా అనిపించే అంశం. టెక్నికల్ గానూ గ్రేట్ గా లేదు. బాగా ఓపిక తెచ్చుకుని రేసింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటే తప్ప ఈ మడ్డీని చివరిదాకా భరించడం చాలా కష్టం.
Also Read : RRR Promotions : ఆర్ఆర్ఆర్ – ది రియల్ ప్రమోషన్