మళ్లీ వెన్నుచూపిన రఘురామ రాజు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మళ్లీ నాలుక మడతేశారు. ఈ నెల 12వ తేదీన సీఐడీ నోటీసులు అందుకున్న తర్వాత.. విచారణకు వస్తానన్న ఆయన.. తాజాగా ప్లేట్‌ ఫిరాయించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల విచారణకు రాలేకపోతున్నానని సీఐడీ అధికారులకు లేఖ రాశారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదని, చికిత్స కోసం వైద్యుడిని కూడా కలిశానని ఆ లేఖలో వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతోపాటు.. తనపై నమోదైన కేసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేశానని, అది విచారణ దశలో ఉందన్నారు. ఈ కారణాల చేత తనకు మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని సీఐడీ అధికారులను ఎంపీ రఘురామ రాజు ఆ లేఖలో కోరారు.

వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామ రాజు నరసాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొద్ది నెలలకే స్వంత పార్టీ, ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఢిల్లీకే పరిమితమైన రఘురామరాజు.. నిత్యం అక్కడ నుంచి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి అయి ఉండి.. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతుండడం, పార్టీ వ్యతిరేకచర్యలకు పాల్పడుతుండడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై రఘురామ రాజు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న రఘురామ రాజుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీకి వస్తే.. చిక్కులు తప్పవని భావించిన రఘురామరాజు ఇన్నాళ్లు ఢిల్లీకే పరిమితం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన తన స్వస్థలం భీమవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌ చేరుకున్నారు.

రఘురామరాజు హైదరాబాద్‌కు వచ్చారని తెలుసుకున్న ఏపీ సీఐడీ అధికారులు.. ఆయన ఇంటికి వెళ్లి కేసు విషయం తెలియజేసి, విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యవరించిన నేపథ్యంలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరవుతానని రఘురామరాజు మీడియా ముఖంగా చెప్పారు. అయితే భీమవరం రావాల్సిన రఘురామరాజు.. సీఐడీ నోటీసులతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. 17వ తేదీన విచారణకు రావాల్సి ఉండగా.. తాజాగా ఆయన రాలేనంటూ లేఖ రాశారు.

సంక్రాంతికి స్వస్థలం వస్తానని ప్రకటించే సమయంలో.. తాను రాజీనామా చేయబోతున్నానని, ఆ లోపు అనర్హత వేటు వేయించేందుకు వైసీపీకి కొంత సమయం ఇస్తున్నానని ప్రకటించారు. సంక్రాంతికి భీమవరం వచ్చిన తర్వాత తన రాజీనామాపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, ఇతర ఉప ఎన్నికలతోపాటు నరసాపురం లోక్‌సభకు ఎన్నికలు జరగడం తధ్యమని రఘురామరాజు అనుచరులు ప్రచారం చేశారు. అమరావతి అజెండాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు.

అయితే రఘురామరాజు రాజీనామా వ్యవహారాన్ని ఆయన తీరు గురించి తెలిసిన వారు పెద్దగా పట్టించుకోలేదు. ఉప ఎన్నికలకు వెళ్లేవాడే అయితే.. అనర్హత వేటు పడకుండా హైకోర్టుకు వెళ్లేవాడేకాదనే వాదనలు వినిపించాయి. తాజాగా రాజీనామాపై కూడా రోజుల వ్యవధిలోనే రఘురామరాజు నాలుక మడతేశారు. సీఐడీ నోటీసులు ఇచ్చిన కారణంగా.. రాజీనామా పై పునరాలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. రాజీనామాపై ఇలా స్పందించిన రఘురామరాజు.. సీఐడీ విచారణకు కూడా అనారోగ్యాన్ని సాకుగా చూపి డుమ్మా కొట్టారు. మరి రఘురామ రాజు ఎపిసోడ్‌లో సీఐడీ తదుపరి స్టెప్‌ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Show comments