MLA Chevireddy, Rayala Cheruvu – ఆపదలో ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి

రాజకీయ నేతల్లో కొంత మంది మాత్రమే ప్రజా నాయకులుగా వెలుగొందుతారు. తమ కష్టాలు, బాధల్లో పాలుపంచుకునే వారిని ప్రజలు కూడా తమ హృదయాల్లో పెట్టుకుంటారు. అలాంటి వారిలో ఒకరే వైసీపీ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా.. తానున్నానంటూ చెవిరెడ్డి ముందుకు వస్తారు. ఆపద్బాంధవుడు మాదిరిగా ఆదుకుంటారు.

మానవాళిని వణికించిన కోవిడ్‌ సమయంలోనైనా, తాజాగా తన నియోజకవర్గంలోని రాయలచెరువు ప్రమాదపు అంచునకు చేరిన సమయంలో ముంపు ప్రమాద ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలను రక్షించడం, వారికి అవసరమైన సహాయం చేయడంలోనైనా.. చెవిరెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చేశామంటే చేశామనే మాదిరిగా కాకుండా.. నిత్యం ప్రజల మధ్యలో, సంఘటన ప్రదేశంలో ఉంటూ, ఓ పక్క చెరువు పటిష్ఠత కోసం చర్యలు చేపడుతూ, మరోపక్క ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను చెవిరెడ్డి చేరవేస్తూ సహాయక చర్యలు చేపట్టడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంటున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలచెరువు నిండింది. 15వ శతాబ్ధంలోని ఈ చెరువు నిండడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఒక్కసారిగా భారీ వరద రావడంతో చెరువుకు చిన్నపాటి గండిపడింది. దాదాపు ఒక టీఎంసీ నీరు ఉన్న ఈ చెరువు కట్ట తెగిపోతే దిగువున ఉన్న 18 గ్రామాలు ముంపునకు గురవుతాయి. వరద ఆయా ఊర్లను ముంచెత్తుతుంది. భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా 18 గ్రామాల ప్రజలను తిరుపతిలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి అవసరమైన భోజన, వసతి ఏర్పాట్లను చెవిరెడ్డి చేశారు.

మరో వైపు చెరువు కట్ట తెగకుండా.. గండిని పూడ్చుతున్నారు. భారీగా ఇసుక, సిమెంట్, కంకర చెరువు వద్దకు తరలించి.. ఆ మిశ్రమాన్ని టీటీడీ అందించిన గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్‌ సంచుల్లో నింపి గండిని పూడ్చారు. ప్రస్తుతం గండి నుంచి నీరు లీకవడంలేదు. చెరువులోని నీటిని వీలైనంతగా బయటకు పంపేందుకు కుప్పం బాదూరు వైపున గండి కొట్టి నీటిని దిగువకు వెళ్లే చర్యలను రాత్రి, పగలు చెరువు వద్దనే ఉంటూ అధికారులతో కలసి చెవిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

తిరుపతిలో పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడని గ్రామస్తులు.. సమీపంలోని కొండలపై గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వారికి ఆహారపొట్లాలను నిత్యం చెవిరెడ్డి అందజేస్తున్నారు. రాయల చెరువు నిండడంతో వెనుక ముంపునకు గురైన రామచంద్రాపురం మండలంలోని చిట్టత్తూరు, రాయలచెరువు, సికాలేపల్లి, పుల్లమనాయుడు కండ్రిక, తిరుపతి రూరల్‌ మండలంలోని వినాయక నగర్‌ కాలనీ వాసులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ అందుబాటులో ఉండడంతో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఓ వైపు నిత్యావసరాలు అందిస్తూనే.. ముంపు గ్రామాలలో ట్రాక్టర్‌పై పర్యటిస్తూ.. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పిస్తున్నారు. చెరువులోని నీరు వెళ్లేందుకు అదనపు ఏర్పాట్లు చేయడం, వర్షాలు తగ్గడం, గండిని పూడ్చడంతో రాయలచెరువు తెగే ప్రమాదం దాదాపు తప్పినట్లేనని భావిస్తున్నారు.

Also Read : Rayalacheruvu – రాయలచెరువు తెగే పరిస్థితి ఉందా..?

Show comments