Mini Municipal Elections – మినీ పోరు.. వైసీపీకి ఛాన్స్‌ ఇవ్వని టీడీపీ

నెల్లూరు కార్పొరేషన్‌ సహా వివిధ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అతి స్వల్పం కావడం.. పోటీ ఎలా జరగబోతోందో తెలియజేస్తోంది. అన్ని చోట్లా అధికార పార్టీతో టీడీపీ హోరాహోరీగా తలపడబోతోంది. జనసేన, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల తరఫున కూడా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నాలుగు చోట్లే ఏకగ్రీవం..

ఒక కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. కేవలం నాలుగు చోట్ల మాత్రమే కొన్ని డివిజన్లు/వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లగాను 8 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఆయా డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో.. అవన్నీ వైసీపీ వశమయ్యాయి. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు అందరూ వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవమైంది. 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి సురేష్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఆ వార్డు వైసీపీ గెలుచుకుంది.

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవమైంది. ఇక్కడ 8వ వార్డులో టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన తండ్రీ, కొడుకులు సాంబయ్య, శ్రీనివాసరావులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో 20 వార్డులకు గాను ఆరు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, మరో రెండు వార్డుల్లో కేవలం వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇదే జిల్లా దాచేపల్లిలో 20 వార్డులకు గాను ఒక వార్డు మాత్రమే ఏకగ్రీవమైంది.

ఇక్కడ హోరాహోరీ..

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేన, సీపీఎంలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. టీడీపీ 12 వార్డులు, జనసేన ఆరు, సీపీఎం రెండు వార్డుల్లో పోటీ చేస్తోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కడప జిల్లా కమలాపురం, రాజంపేట, కర్నూలు జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొంది.

Also Read : Tpd,Chandrababu – అయ్యో.. చంద్రబాబు, గురితప్పుతున్న బాణాలు!

Show comments