General Rawat, Taiwan’s army chief, Helicopter crash – హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక కుట్ర ఉందా..?

తమిళనాడులోని ఊటి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మరణించారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. పొగ మంచు వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఇదే తరహాలో గత ఏడాది తైవాన్‌ ఆర్మీ చీఫ్‌ షెన్‌ ఇ మింగ్‌ కూడా మరణించారు. రెండు ఘటనలు ఒకే మాదిరిగా జరగడంతో ఇప్పుడు ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చైనాతో వైరం ఉన్న తైవాన్, భారత్‌ దేశాల ఆర్మీ చీఫ్‌లు ఒకే విధంగా ప్రాణాలు కోల్పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనాకు దక్షిణంగా ఉన్న చిన్న దేశం తైవాన్‌. ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించాలని, దక్షిణ సముద్రంపై పట్టు సాధించాలని చైనా కొన్నేళ్లుగా యత్నిస్తోంది. హాంకాంగ్‌ మాదిరిగా తమపై కూడా పెత్తనం చేయాలని చూస్తున్న చైనా ప్రయత్నాలను తైవాన్‌ సాగనీయడం లేదు. చైనాతో కయ్యానికి కాలు దువ్వేందుకు కూడా సిద్ధమైంది. చైనా, తైవాన్‌ల మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. గత ఏడాది జవవరి 3వ తేదీన తైవాన్‌ ఆర్మీ చీఫ్‌ షెన్‌ ఇ మింగ్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతోపాటు మరో ఏడుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : Celebrities, Air Accident Deaths – రావత్ కంటే ముందు హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!

భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ కూడా అదే తరహా ప్రమాదంలో చనిపోవడంతో అనుమానాలకు తెరలేచింది. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. గత ఏడాది చైనా బలగాలు భారత్‌ భూ భాగంలోకి చొచ్చుకు వచ్చాయానే వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపైనే భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించారు. అప్పటి నుంచి భారత్, చైనా మధ్య ఉన్న వివాదం పెద్దదైంది. ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

భారత్, చైనాల మధ్య ఇలాంటి పరిస్థితులు ఉండగా.. త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారు. చైనా శత్రువైన తైవాన్‌ ఆర్మీ చీఫ్‌ మాదిరిగానే.. బిపిన్‌ రావత్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురి కావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై భారత వాయు సేన మార్షల్‌ మన్వేంద్రసింగ్‌ దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే గానీ హెలికాప్టర్‌ కుప్పకూలడం ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేదా కుట్ర ఉందా..? అనేది తెలిసి వస్తుంది.

Also Read :Rajnath Singh, Bipin’s Funeral – ప్రమాదంపై రక్షణ మంత్రి ప్రకటన.. రేపు బిపిన్‌ అంత్యక్రియలు..

Show comments