Idream media
Idream media
కళాత్మకంగా వున్నా సరే, సాలెగూడు నివాస యోగ్యం కాదు. లివింగ్ స్కిల్క్‌కి సాలెపురుగు పెద్ద ఉదాహరణ. దారం కోసం వెతుక్కోదు. శరీరంలోంచి సృష్టిస్తుంది. వలలోకి లాగుతుంది. పట్టు పురుగు కూడా దారాన్ని సృష్టించి నేతగాడి చేతిలో పెడుతుంది. పట్టుచీరంటే పండుగ. శుభకార్యాలొస్తే కట్టుకుంటారు. సాలెగూడుని దులిపేస్తారు.
తన కోసం బతికేవాళ్లకి , ఇతరుల కోసం వుండేవాళ్లకి తేడా ఇది.
ధూపమేసి పెంచినా సింహం నెత్తుటి వాసన మరిచిపోదు. బతకాలంటే ఎవరో ఒకర్ని తినాలి. సింహానికి, జింకకి దేవుడు ఒకటే. ఆయన సింహం వైపే వుంటాడు. బలవంతులు నైవేద్యం పెడతారు.
అనేక చేతులతో మర్రిచెట్టు కలకత్తా కాళీలా కనిపిస్తూ వుంది. రాలుతున్న ఆకులు కన్నీళ్లా?
గొర్రె యజమానిని ప్రేమిస్తుంది. యజమాని ప్రేమిస్తాడా? కోసే ముందు మెడ నిమురుతాడు. పసితనం నుంచి తిండిపెడుతూ ముద్దు చేసిన వాడే గొంతుకి కత్తి పెట్టి చర్మాన్ని చీలుస్తున్నప్పుడు గొర్రె ఏమి ఆలోచిస్తుంది.
రాగాలు తెలియని పశువు, చనిపోయి తన చర్మానికి రాగాలు నేర్పుతుంది. బతికినంత కాలం కాడిని మోసి, పోయి చర్మంతో సంగీతాన్ని ఇస్తుంది. మనిషి చర్మమే దేనికీ పనికిరాదు. ఒకవేళ డప్పు చేయడానికి పనికొస్తే అన్నీ అపస్వరాలే పలికేదేమో! సక్కగా బతకనోళ్లు , సస్తే సక్కగా వుంటారా?
నేలపైకి వస్తే మొసలి, ముసలి.నీళ్లలో వుంటే బాహుబలి
స్థలం, కాలం కలిస్తేనే బలం.
అనగనగా ఒక రోజు అని కథలు మొదలవుతాయి. కానీ, అనగనగా ఒక సైనికుడు అని కాదు. చదరంగంలో కూడా రాజుని చంపరు. చెక్ పెడతారు.
మేకకి యజమాని అర్థం కావాలంటే తల తెగాలి.
గుర్రం ఎగరకపోతే పోయింది. వెనక్కి పరిగెత్తకపోతే చాలు.
జలపాతం పొగరుగా వుంటుంది. ఎత్తు నుంచి దూకేవాడు ఎవడైనా అలాగే వుంటాడు.
పక్షిని గురి చూడకు. గూట్లో చిన్నపిల్లలున్నారు!
నువ్వు గాలి పీల్చే సమయంలోనే, ప్రపంచంలోని ప్రతి జీవి పీలుస్తుంది. గాలిని గౌరవించు. అది కదిలితే సంగీతం. ఆగితే మృత్యువు.
జీవితం ఒక చదరంగం. గుర్రంలా అడ్డదిడ్డంగా వెళ్లు. కాసేపు ఆట నడుస్తుంది.
Also Read : నిన్ను నువ్వు తెలుసుకో!