Donald Bradman – ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడి ఆర్డినరీ ఆరంగేట్రం

నవంబర్ 30,1928న ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన యాషైస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ నగరంలో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ చూస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన అయిదడుగులా ఏడు అంగుళాల ఎత్తు ఉన్న ఇరవై సంవత్సరాల డోనాల్డ్ జార్జ్ బ్రాడ్ మన్ బ్యాటింగ్ కోసం ఎదురు చూశారు. అప్పటికి కేవలం తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి ఉన్న బ్రాడ్ మన్ దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించి ఉండడం, కొన్ని రోజుల ముందు జరిగిన మ్యాచ్ లో తన జట్టు న్యూ సౌత్ వేల్స్ తరఫున ఇంగ్లాండు జట్టు మీద సెంచరీ సాధించి ఉండడంతో అతని మీద అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

స్వంతంగా శిక్షణ

1908లో జన్మించిన బ్రాడ్ మన్ చిన్న తనంలోనే క్రికెట్ పట్ల ఆకర్షితుడు అయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ లోని ఒక చిన్న నగరంలో ఉన్న అతనికి కోచింగ్ సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో క్రికెట్ స్టంపు, గోల్ఫ్ బాల్ సహాయంతో స్వంతంగా ఆడడం నేర్చుకున్నాడు. తన ఇంటి వెనుక వాటర్ ట్యాంకుకి వంపుగా ఉన్న గోడకేసి స్టంపుతో గోల్ఫ్ బాలుని కొడితే అది రకరకాల దిశల్లో వెనక్కి వచ్చేది. దాన్ని మళ్ళీ స్టంపుని బ్యాట్ లా ఉపయోగించి గోడకేసి కొట్టేవాడు. దీనివల్ల అతని పాదం కదలికలు చురుగ్గా ఉండడమే కాకుండా, వేగంగా కదులుతూ బంతిని కొట్టడం అలవాటైంది.

పన్నెండేళ్ళ వయసులో స్కూల్ తరఫున సెంచరీ సాధించిన బ్రాడ్ మన్ ఆ తర్వాత వివిధ స్థాయిల్లో జరిగిన పోటీల్లో బాగా రాణించడంతో పంతొమ్మిది సంవత్సరాల వయసులో న్యూ సౌత్ వేల్స్ జట్టు తరఫున ఎంపికై, మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. అతని చురుకైన ఫుట్ వర్క్, వేగంగా పరుగులు సాధించే లక్షణం జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, 1928లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టుతో ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్థానం కల్పించింది.

నిరాశ పరిచిన ఆరంభం

ఇంగ్లాండు, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తుంది. దానికి తగ్గట్టుగా1882-73లో ప్రారంభమైన ఈ సిరీస్ గెలవడానికి ఇరు జట్ల ఆటగాళ్లు, క్రికెట్ సంఘాల అధికారులు సర్వశక్తులు ఒడ్డుతారు. 1926లో ఇంగ్లాండులో జరిగిన అయిదు టెస్టుల సిరీస్ లో నాలుగు టెస్టులు డ్రాగా ముగియగా, ఇంగ్లాండు జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియా నుంచి గెలుచుకున్న యాషెస్ నిలబెట్టుకోవడానికి 1928లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది.

Also Read :  Test Cricket – 10 Lakh Runs -టెస్టు క్రికెట్ లో పది లక్షలపరుగు సాధించిన రోజు

మొదటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు జట్టు 521 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 122 పరుగులు సాధించి అలౌట్ అయింది. ఏడవ స్థానంలో బ్యాటింగుకి దిగిన బ్రాడ్ మన్ 18 పరుగులు చేసి అవుటయి తనకోసం ఎదురు చూసిన అభిమానులను నిరాశ పరిచాడు. ఇంగ్లాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసి డిక్లేర్ చేయగా 741 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఈసారి కేవలం 66 పరుగులకే ఆలౌట్ అయింది. ఈసారి బ్రాడ్ మన్ ఒక పరుగుకే అవుటయ్యాడు. 675 పరుగుల తేడాతో ఇంగ్లాండు జట్టు విజయం సాధించిన రికార్డు ఈరోజుకి పదిలంగా ఉంది.

మొదటి మ్యాచ్ లో వైఫల్యం వలన రెండవ మ్యాచ్ లో బ్రాడ్ మన్ ని జట్టు నుంచి తొలగించారు. అందులో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. మూడవ మ్యాచ్ కోసం జట్టులోకి తిరిగి వచ్చిన బ్రాడ్ మన్ దానిలో 112 పరుగులు సాధించి అప్పటికి టెస్టు సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు కానీ జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. పోటాపోటీగా జరిగిన నాలుగో మ్యాచ్ చివరి రోజున జట్టుని విజయం వైపు నడిపిస్తున్న దశలో రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా దానిలో ఓటమి పాలయింది. బ్రాడ్ మన్ కెరీర్లో ఇదొక్కటే రనౌట్. అయిదో మ్యాచ్ లో 123 పరుగులతో మరో సెంచరీ సాధించి జట్టుని గెలిపించాడు బ్రాడ్ మన్.

1930 సిరీస్ లో పరుగుల వరద

1930లో ఇంగ్లాండులో పర్యటించే జట్టుకి ఎంపికైన బ్రాడ్ మన్, దేశవాళీ పోటీలో భాగంగా క్వీన్స్ లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 415 నిమిషాల్లో 452 పరుగులతో ప్రపంచ రికార్డు స్థాపించి, భారీ స్కోరు సాధించగల తన సత్తాని మొదటిసారి ప్రదర్శించాడు.

ఇంగ్లాండులో జరిగిన మొదటి మ్యాచ్ లో 131 పరుగులతో సెంచరీ సాధించినా ఆస్ట్రేలియా దానిలో ఓటమి పాలయింది. రెండవ మ్యాచ్ లో 254 పరుగులతో డబుల్ సెంచరీ సాధించి జట్టుని గెలిపించాడు బ్రాడ్ మన్. మూడో మ్యాచ్ లో బ్రాడ్ మన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. మొదటి రోజు లంచ్ లోపు వంద పరుగులు సాధించిన బ్రాడ్ మన్ టీ టైమ్ లోపు మరో వంద పరుగులు, టీ తర్వాత మూడో సెషన్లో మరో వంద పరుగులు సాధించి 334 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే వర్షం కారణంగా వాతావరణం సహకరించక ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగో మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రాగా ముగియగా, నిర్ణయాత్మకంగా మారిన అయిదో మ్యాచ్ లో బ్రాడ్ మన్ 232 పరుగులతో డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా గెలుచుకుంది.

Also Read : World Cup T20 – క్యాచ్ డ్రాప్ – కప్ డ్రాప్

యాషెస్ చరిత్రలో మాయని మచ్చ బాడీలైన్

1932-33 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ఇంగ్లాండు జట్టుకు నాయకత్వం వహించిన డగ్లస్ జార్డిన్ ఎలాగైనా సిరీస్ గెలవాలన్న పట్టుదలతో, బ్రాడ్ మన్ ని ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, 1930 సిరీస్ లో షార్ట్ పిచ్ బంతులనూ, శరీరం మీదకు వచ్చిన బంతులనూ ఎదుర్కోవడానికి బ్రాడ్ మన్ ఇబ్బంది పడిన విషయం తెలుసుకున్నాడు. అప్పట్లో ఒక ఓవర్లో ఒకటే బౌన్సర్ వేయాలన్న నిబంధన లేదు. బ్యాటర్ కి కాళ్ళకు ప్యాడ్స్, చేతికి గ్లవ్స్ తప్ప మరే ఇతర రక్షణ సామగ్రి ఉండేది కాదు. శరీరం మీదకు దూసుకొచ్చే బంతులు శరీరానికి తగలకుండా అడ్డుకున్నప్పుడు గ్లవ్స్ కో, చేతికో తగిలి ఫీల్డర్ల చేతిలో పడి అవుట్ అవుతారని, లేదంటే బంతి తగిలి గాయపడిన బ్యాటర్లు తమ సహజమైన ఆట ఆడలేక అవుటవుతారని జార్డిన్ లెక్క వేశాడు.

ఆస్ట్రేలియా ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు షాకయ్యేలా తన ఫాస్ట్ బౌలర్ హెరాల్డ్ లార్వుడ్ చేత షార్ట్ పిచ్ బంతులు సంధించేలా చేసి, వ్యక్తిగత కారణాల వల్ల బ్రాడ్ మన్ లేని ఆస్ట్రేలియా జట్టు మీద మొదటి టెస్టు గెలిచాడు జార్డిన్. బ్రాడ్ మన్ జట్టులోకి తిరిగి వచ్చాక రెండవ టెస్టులో గెలిచినా, ఆ తర్వాత మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలయింది. ఇంగ్లాండ్ సిరీస్ గెలిచినా ఆ జట్టు అవలంబించిన పథ్ధతుల వల్ల ఇంటాబయటా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. బాడీలైన్ వ్యూహానికి సృష్టికర్త అయిన డగ్లస్ జార్డిన్ ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేదు.

డాన్ బ్రాడ్ మన్ ఆగస్టు 1948 వరకూ క్రికెట్ ఆడి, విశేషంగా రాణించి, అప్రతిహతమైన గణాంకాలతో 99.96 యావరేజితో తన కెరీర్ ముగించి, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Also Read : కెప్టెన్ వాడేకర్ గవాస్కర్ ను బాత్రూమ్ లో ఎందుకు దాచిపెట్టాడు?

Show comments