Idream media
Idream media
నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఓ సంచలనం. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి అడ్డుకట్ట వేసింది. ఆవిర్భవించిన తొమ్మిది నెలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం. 1995లో నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అప్పటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నందమూరి స్థాపించిన పార్టీ నాటి నుంచీ నారా వారి చేతిల్లోకి వచ్చింది. టీడీపీ అంటే నారా చంద్రబాబు నాయుడు అన్నట్లుగా పార్టీలో తానే శాసనకర్తగా ఎదిగారు.
1995 నుంచీ 2019 వరకూ టీడీపీలో తిరుగులేని అధినేతగా బాబు కొనసాగుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి జగన్ పరిపాలన దక్షత, సంస్కరణల ఫలితంగా చంద్రబాబు హవా తగ్గడం మొదలైంది. అది ఎంతలా అంటే.. పార్టీలో కీలక నేతలు కూడా బాబుతో నేరుగా మాట్లాడేందుకు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి నుంచి.. సామాన్య కార్యకర్త కూడా ప్రశ్నించే స్థాయికి. అలాగే ఏపీలో పార్టీ ప్రాభవం కూడా తగ్గిపోతోంది. అది ఎంతలా అంటే.. ఎన్నికలు అంటే ఉత్సాహంగా ముందుకు ఉరికే పరిస్థితి నుంచి బహిష్కరణ పేరుతో పోటీ చేసేందుకు భయపడే స్థితికి. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఎన్నడూ ఊహించని, ఎప్పుడూ చవిచూడని ఓటములను ఎదుర్కోవాల్సి వస్తోంది.
రాజకీయాల్లో ఓడిపోవడం, గెలవడం సాధారణమే. అయితే, రెండేళ్లుగా ఏపీలో తెలుగుదేశం ఘోరమైన అపజయాలను చవిచూస్తోంది. పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్, పరిషత్.. ఇలా అన్ని స్థాయిల్లోనూ ఓటమి టీడీపీకి సాధారణంగా మారింది. ఇప్పుడా ఓటమి చంద్రబాబునాయుడి నియోజకవర్గం కుప్పం వరకూ వచ్చేసింది. తాజాగా జరిగిన కుప్పం మునిసిపాల్టీ కూడా టీడీపీ చేజారింది. బంపర్ మెజార్టీతో వైసీపీ కైవసం చేసుకుంది. చెప్పుకోవడానికే చిన్న మునిసిపాలీటీ అయినా అది కుప్పం కాబట్టి అక్కడ రాజకీయంగా వస్తున్న మార్పు కొత్త తరహా చర్చలకు దారి తీస్తోంది.
ఏడు పర్యాయాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే కుప్పాన్ని చంద్రబాబు కోట అని చెబుతుంటారు. మరి అలాంటి బాబు కోట ఇప్పుడు బీటలు వారుతోంది. అన్ని ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగురుతోంది. దీన్నిబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నట్లే లెక్క. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం అటుంచితే.. కాపాడుకోవడం ఇప్పుడు తక్షణ అవసరంగా మారనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బాబు తన సొంత నియోజకవర్గాన్నే కాపాడుకోలేకపోతున్నారు. ఇక పార్టీని ఎలా కాపాడగలరనే చర్చ మొదలైంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెత్తనం కావాలనుకుంటే పార్టీ ప్రజలకు దూరమయ్యేలా ఉంది. మరి పార్టీ నిలబడాలంటే నాయకత్వం మారాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ నందమూరి వారి చేతుల్లోకి వెళ్తేనే పార్టీ గత వైభవాన్ని సాధించగలదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కున్నారని.. చివరికి ఆ పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. పార్టీ మనుగడ సాధించాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగించాలని సూచిస్తున్నారు. వరుస ఓటమిలతో కుంగిపోయిన చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ తన ఆరోగ్యం కాపాడుకోవడం మంచిదన్నారు. గతంలో టీడీపీలోని కొందరు సీనియర్లు కూడా పార్టీకి కొత్త నాయకత్వం కావాలని బహిరంగంగానే చెప్పారు. కుప్పం మున్సిపాల్టీలో టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడు మరోసారి నాయకత్వ మార్పు తెరపైకి వచ్చింది.