Idream media
Idream media
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు కుప్పం నియోజకవర్గంతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నా.. పట్టించుకోకపో్యినా.. ఆ ప్రాంత ప్రజలు మాత్రం బాబు ప్రతీ ఎన్నికల్లోనూ పట్టించుకుంటూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా అధికారాన్ని కట్టబెడుతూనే ఉన్నారు. అందుకేనేమో.. బాబు ఎన్నికలప్పుడే తప్పా.. మిగతా సమయాల్లో ఈ ప్రాంతంవైపు పెద్దగా చూసేవారు కాదు. కానీ.. కుప్పం మున్సిపాల్టీని కోల్పోయినప్పటి నుంచీ బాబులో మార్పు కనిపిస్తోంది. కుప్పంలో దిమ్మతిరిగాక కానీ బాబుకు కేడర్, తమ్ముళ్ల విలువ తెలిసి వచ్చినట్లుంది. ఈసారి కుప్పం పర్యటనలో బాబు లో కనిపిస్తున్న మార్పును గమనించిన తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. మున్సిపాల్టీలో ఓడిపోవడమే మంచిదైందని భావిస్తున్నారట.
తాజాగా ఇటీవల కుప్పంలో పర్యటించిన బాబు ఇక్కడి జనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా ప్రజలపై అపవాదు చేస్తూనే కేడర్ కు మాత్రం విలువ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఇకపై బాగా పనిచేయాలని.. కుప్పంలో కోవర్టులు పంపేసి.. పార్టీని ప్రక్షాళన చేస్తానని ఆయన తెలిపారు. ఎప్పటి నుంచో తలనొప్పిగా మారిన పీఏ మనోహర్, గౌరివాణి శ్రీనివాసులు, మునిరత్నంలను పక్కన పెట్టాలని ముఖ్యంగా పార్టీ కేడర్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో చేద్దాం.. చూద్దాం అని నాన్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం వారితోపాటు మరో ముగ్గురిని.. కొందరు కోవర్టులను ఇంటికి పంపుతానని చెప్పారట. దీంతో వరస ఓటములు చంద్రబాబును ఇంతలా మారుస్తాయని అనుకోలేదని చెబుతున్నారు టీడీపీ తమ్ముళ్లు.
అలాగే.. ఇక నుంచి లీడర్లతో పాటు.. కేడర్ చెప్పిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని బాబు పేర్కొన్నారు. తమ్ముళ్లను పలకరించేందుకు తరచూ వస్తానని చెప్పడం మరో విశేషం. ఎన్నడూ లేని రీతిలో ఈసారి బాబు కేడర్ కు, తమ్ముళ్లకు తెగ విలువ ఇచ్చారు. లీడర్లతో తప్పా.. కార్యకర్తలను అంతగా పట్టించుకోని బాబు ఈసారి వారితో కూడా మాట్లాడడం తమ్ముళ్లకు సంతోషానిచ్చింది. అందువల్లనేమో కుప్పం మున్సిపాల్టీలో టీడీపీ ఓడిపోవడమే మంచిదైందని తమ్ముళ్ల ఆనంద పడుతున్నారని పార్టీ వర్గాల్లో టాక్. ఇంత వరకూ ఓకే కానీ.. ఇంకా మార్పు వస్తుందని కొంపతీసి చంద్రబాబును ఓడించరు కదా..!?