Idream media
Idream media
కొణిజేటీ రోశయ్య…. 88 ఏళ్ల ఈ రాజకీయ నేత… తుది వరకు ఎలాంటి వివాదాలు లేవు. ఎలాంటి అవినీతి మరకలు లేవు. ఇంకా చెప్పాలంటే… ప్రస్తుత రాజకీయ నేతలకు రోశయ్య ఓ డిక్షనరీ. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు… కానీ ఆయన మాత్రం చెక్కు చెదరలేదు. ఏ మాత్రం భయపడలేదు. బెదరలేదు. ఆయన ఆరంభం కాంగ్రెస్ పార్టీలోనే… చివరి వరకు కూడా హస్తం పార్టీలోనే ఉన్నారు కొణిజేటి రోశయ్య.
ప్రస్తుత రాజకీయాల్లో చిన్న పదవుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కానీ రోశయ్య మాత్రం పీసీసీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా… పదవులు అనుభవించారు. కానీ ఏ పదవి కోసం ఆయన ఏ ప్రయత్నం చేయలేదు. ఇంకా చెప్పాలంటే… ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన కోరకుండానే వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో… పార్టీ అధిష్ఠానం సీఎం పదవిని రోశయ్యకు అప్పగించింది. అయిష్టంగానే ఆ పదవి చేపట్టిన రోశయ్య… 14 నెలల పాటు సీఎం స్థానంలో కొనసాగారు. ఎన్ని విమర్శలు వచ్చినా… ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. చివరికి ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనంటూ… తానే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా రోశయ్యకు పేరు. పార్టీలకు అతీతంగా రోశయ్యకు అభిమానులు ఉన్నారంటే… ఆయన ఏ స్థాయి నేత అనేది అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది నేతలను ఆయన పేరు పెట్టి పిలవగలరు. ఇంకా చెప్పాలంటే… నా రాజకీయ అనుభవం అంత లేదు… నీ వయస్సు అంటూ చమత్కరించే వారు కూడా. కింది స్థాయి కార్యకర్త అయినా… జాతీయ స్థాయి నేత అయినా సరే… రోశయ్య పలకరింపులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కింది స్థాయి నేత మొదలు… ప్రధాని వరకు ఆయనకు అభిమానులే. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా దిట్ట. ఏకంగా 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు కూడా రోశయ్య పేరు మీదే ఉంది. ఆ రికార్డు ఇప్పట్లో ఎవరూ చెరిపివేయలేరు కూడా. రాష్ట్రంలో తొలిసారి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత కూడా రోశయ్యకే దక్కుతుంది.
Also Read : Ex.CM Rosaiah Died- మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత..
ఆర్థిక క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన రోశయ్య… ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి తప్పనీయలేదు. నిధుల కేటాయింపులో సమతుల్యత పాటించారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ పథకానికి ఎంతివ్వాలి అనే అంశంలో ఫుల్ క్లారిటీ ఉన్న నేత. పార్టీకి చెడ్డపేరు రాకుండా… ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా… ప్రతి రూపాయిని అతి జాగ్రత్తగా ఖర్చు చేసిన ఆర్థిక తత్వవేత్త కొణిజేటి రోశయ్య. తన బడ్జెట్‌లో సామాన్యులకు పెద్ద పీట వేశారు. సామాన్యులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు రోశయ్య తన బడ్జెట్‌ను రూపొందించేవారు. వైఎస్ఆర్ హయాంలో జల యజ్ఞం అంటూ చేపట్టిన ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో జాగ్రత్త పాటించారు. ప్రాజెక్టుల ప్రాధాన్యతకు పెద్ద పీట వేస్తూ నిధుల కేటాయింపు చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, హోమ్ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు రోశయ్య.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా ప్రియ శిష్యుడిగా రోశయ్యకు పేరు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని నిడుబ్రోలులోని రామనీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో కలిసి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1979లో తొలిసారి మంత్రివర్గంలో చేరారు. ఇక 1995-97 మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షునిగా, 1998లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించారు కూడా. ఎన్ని పదవులు నిర్వహించినా కూడా… ఆ పదవులు రోశయ్యకు అలంకారమే. ప్రస్తుత రాజకీయ నేతలకు రోశయ్య ఓ డిక్షనరీ. ఆయన అనుభవాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమే.
కొణిజేటి రోశయ్య పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం అయినప్పటికీ… ఆయనకు ప్రకాశం జిల్లాలో విడదీయరాని అనుబంధం ఉంది. జిల్లాలోని చీరాల, మార్కాపురం ప్రాంతాలపై రోశయ్యకు ప్రత్యేకమైన అభిమానం. జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ రెండు ప్రాంతాల సందర్శన తప్పనిసరి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకునే వారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేవారు రోశయ్య. చీరాల ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి రోశయ్య ఎంతో ప్రయత్నం చేశారు. చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి, వస్త్ర వ్యాపారం కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, దూర ప్రాంత రైళ్లు ఆగేందుకు కూడా రోశయ్య ఎంతో కృషి చేశారు.
ఇక 2004 నుంచి 2009 వరకు చీరాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రోశయ్య… ఆ తర్వాత మాత్రం… ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో మరోసారి రోశయ్యకు అవకాశం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భావించినా కూడా… సున్నితంగా తిరస్కరించారు. తన రాజకీయ వారసుడిగా ఆమంచి కృష్ణమోహన్ పేరును ప్రతిపాదించారు రోశయ్య.
Also Read : Konijeti Rosaiah, Political Journey – రోశయ్య రాజకీయ పయనం అనన్యం, ఆదర్శం