Kondapalli – గందరగోళం మధ్య చైర్మన్ ఎన్నిక వాయిదా

దాదాపు వారం రోజుల నుంచి ఉత్కంఠ రేపుతోన్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు పట్టుదలగా వ్యవహరించటం… మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇద్దరు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్ళడంతో ఏం జరగబోతుంది ఏంటనేది అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితుల నడుమ రిటర్నింగ్ అధికారి ఎన్నికను నిర్వహించగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయగా వైసిపి నాయకులు తమకు న్యాయం జరగాలంటూ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని కౌన్సిలర్లను వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. నిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేసి కాసేపటి క్రితం ఎన్నిక మొదలు పెట్టగా ఆ తర్వాత కూడా పరిస్థితి వేడెక్కింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఇరు పార్టీల కౌన్సిలర్లు ఖాళీచేసి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తమమీద దౌర్జన్యానికి దిగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపణలు, తమ మీద దాడి చేసేందుకు వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నం చేస్తున్నారని టిడిపి ఆరోపించింది. అయితే ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు ఎంపీ కేశినేని నాని ప్రయత్నం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.

అయితే ఎన్నిక జరగాల్సిందేనని కేశినేని నాని పట్టుబట్టి మున్సిపల్ కార్యాలయంలో కూర్చోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు మంత్రి కొడాలి నాని అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేరుకొని వైసిపి కౌన్సిలర్ లకు అండగా నిలిచారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 29 స్థానాలున్న కొండపల్లి మున్సిపాలిటీలో 14 తెలుగుదేశం 14 వైసీపీ గెలవగా ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో టిడిపి బలం 15కు చేరుకుంది. ఇక ఎక్స్ అఫీషియో ఓటు కింద విజయవాడ ఎంపీ కేశినేని నాని కి ఓటు వేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో టిడిపి బలం 16 కాగా వైసిపి బలం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిపి 15 కి చేరుకుంది. బొటాబొటీ మెజార్టీతో ఉండటంతో పరిస్థితులు ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేది చూడాలి.

Show comments