Idream media
Idream media
వచ్చే ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వార్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తున్నారు. అనూహ్యంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడంతో కేసీఆర్ రంగంలోకి దిగి రాజకీయాల్లో హీట్ పెంచేశారు. గతానికి భిన్నంగా అధికంగా మీడియా ముందుకు వస్తూ బీజేపీపై విరుచుకు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీటి వెనుక రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే జనక్షేత్రంలోకి కేసీఆర్ వచ్చేశారు. మీడియా సమావేశాలతో పాటు, జిల్లాల పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనుల్లో దూకుడు పెంచారు. దళితబంధు వంటి మరిన్ని మహత్తర పథకాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే అన్ని అవకాశాలను వినియోగించుకుని ప్రజాక్షేత్రంలోకి టీఆర్‌ఎస్ పథకాలను, కేసీఆర్ విజయాలను తీసుకెళ్లడమే ధ్యేయంగా శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే కేసీఆర్ జన్మదినాన్ని కూడా ఉపయోగించుకునేలా వ్యూహరచన చేశారు.
సాధారణంగా జన్మదినోత్సవాన్ని సాదాసీదాగానే చేసుకోవడం కేసీఆర్‌కు అలవాటు. శ్రేణులకు అలానే పిలుపు ఇస్తారు. అయితే, ఈసారి టీఆరెస్ ఘనంగా జరుపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం నేడు అయినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంబరాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు పిలుపు మేరకు ఘనంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
పార్టీ శ్రేణులు ఎవరికి వారు తమ సేవా దృక్పథాన్ని చాటేలా ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే 15న అన్నదాన కార్యక్రమాలు, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, జన్మదినమైన 17న రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అలాగే ఇతరులకు సహాయ పడేందుకు ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే యువతను ఆకట్టుకోవడానికి క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఆయా వేడుకల సందర్భంగా స్వరాష్ట్ర సాధనతో పాటు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సాధించిన ప్రగతిని, ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది. ఈ మేరకు కేటీఆర్ వ్యూహరచన చేశారు.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విపరీతంగా ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.