Idream media
Idream media
తెలంగాణలోని ఉద్యమ కారులపై దృష్టి సారించిన కాషాయదళం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కుడిభుజంగా పేరొందిన ఈటల రాజేందర్ ఇప్పటికే ఆ పార్టీలో చేరారు. అనంతరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్, తీన్మార్ మల్లన్నవంటి వారు కూడా కాషాయజెండా కప్పుకున్నారు. బీజేపీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి తో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో చర్చలు జరిపారు. జిట్టా ఆధ్వర్యంలోని యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారు. ఈమేరకు పార్టీ విలీనానికి అంగీకారం తెలుపుతూ బీజేపీ జాతీయ నాయకత్వానికి జిట్టా తాజాగా లేఖ పంపించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే యువ తెలంగాణ పార్టీ కాషాయదళంలో విలీనం కానుంది.
అధిష్ఠానం ముందు కొన్ని షరతులు
ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డి కొన్ని షరతులు బీజేపీ అధిష్ఠానం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా, తరుణ్ చుగ్ లకు లేఖ రాసిన ఆయన తమకు సీట్లు, పార్టీ లో ప్రాధాన్యత పై క్లారిటీ కోరారు. పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణారెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ టికెట్ కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు భువనగిరిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని వారి సన్నిహితులు తెలిపారు. కాగా, ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, రుద్రమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందనే చర్చ మొదలైంది. ఇరువురూ కొంత కాలంగా పలు పదవుల కోసం పోటీపడి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
క్రియాశీల రాజకీయాల్లో ‘రాణించాలని’..
యాంకర్ గా రాణి రుద్రమదేవి చాలా మందికి సుపరిచితురాలే. ఆమె ఈటీవీ, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో 2010లో తెలంగాణ భవన్ లో టిన్యూస్ ప్రారంభమైంది. ఆ సంస్థలో రాణి అసోసియేట్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తర్వాతి కాలంలో టిన్యూస్ వదిలేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. వైఎస్సార్ కాంగ్రెెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసిపి అభ్యర్థిగా ఆమె పేరును కూడా పార్టీ ప్రకటించింది. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు. కానీ.. రాష్ట్ర విభజన జరగడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
విభజన అనంతరం టీఆర్ ఎస్ వైపు ఆకర్షితురాలైనప్పటికీ తగిన గుర్తింపు లేదన్న కారణంతో కొంతకాలం పాటు ఆమె స్తబ్దుగా ఉన్నారు. గత ఎన్నికల్లో కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు తొలుత వచ్చాయి. ఈలోగా.. ఎన్నో ఏళ్ల క్రితం భువనగిరికి చెందిన నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి నెలకొల్పిన యువజన సంఘాల సమితిని రాజకీయ పార్టీగా 2018లో ప్రకటించారు. ఆ పార్టీలో చేరిన రాణిరుద్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరి.. అధికార పార్టీపై పోరాటానికి సిద్ధమవుతున్న రుద్రమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందో చూడాలి.
జిట్టా వ్యూహాత్మకంగా బీజేపీలోకి…
ఉమ్మడి నల్గొండ జిల్లా కు జిట్టా బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల సమితి ద్వారా నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేసేవారు. 2018లో యువతెలంగాణ పార్టీ ని స్థాపించారు. అనంతరం.. కొంతకాలం తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేసేందుకు తన బలం సరిపోవడం లేదని భావిస్తున్న ఆయన తొలుత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఉద్యమ సమయంలో బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన గట్టిగా పోరాటం చేశారు. అయితే కేసీఆర్ జిట్టా బాలకృష్ణారెడ్డి కి సీటు ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ తో విభేదించి బయటకు వచ్చిన బాలకృష్ణా రెడ్డి వరుసగా మూడు సార్లు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నే రెండు సార్లు రెండో స్థానంలో నిలిచిన ఆయన, ఒకసారి మూడో స్థానంలో నిలిచారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగేది.
అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. అధికార పార్టీతో గట్టిగా పోరాడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీజేపీనే మేలని జిట్టా భావించారు. ఈ క్రమంలోనే యువతెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు. ఆయనకు భువనగిరి నియోజకవర్గ ప్రజలతో రెండు దశాబ్దాల అనుబంధం. అక్కడ ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో జిట్టా బీజేపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం అందుకు ఓకే అంటుందా, లేదా అనేేేది చూడాలి.