Idream media
Idream media
ఆటల్లో ఎక్కువ స్కోర్ చేసిన వారే విజేతలు. కానీ రాజకీయ ఆటలో ఇందుకు పూర్తిగా భిన్నంగా సాగుతుంటుంది. మన దేశ రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రత్యేకమైన లక్షణమది. ఇదే కొన్ని రాజకీయ పార్టీల పాలిట కల్పతరువుగా మారుతోంది. మేజారిటీ ప్రజల మద్ధతు లేకపోయినా.. అధికారం దక్కించుకుంటున్నాయి. ఈ తరహా పార్టీలలో జనతాదల్(సెక్యులర్) (జేడీఎస్) ముందు వరసలో ఉంటోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను 37 సీట్లు గెలిచి సీఎం కుర్చి సొంతం చేసుకోగా.. తాజాగా కుల్బర్గా (గుల్బర్గా ) మున్సిపల్ కార్పొరేషన్‌లో 55 సీట్లకు గాను నాలుగు సీట్లు గెలిచి మేయర్ పీఠం దక్కించుకోబోతోంది.
ఈ నెల 3న జరిగిన కుల్బర్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 6వ తేదీన వెల్లడయ్యాయి. 55 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 27, బీజేపీ 23, జేడీఎస్ నాలుగు సీట్లు గెలుచుకోగా.. ఒక డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మేజారిటీ రాలేదు.
జేడీఎస్ కింగ్ మేకర్..
8 ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓట్లు వేసే వారి సంఖ్య 63. మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకోవాలంటే 32 ఓట్లు కావాలి. 8 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక లోక్‌సభ ఎంపీ, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఇందులో ఒక ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్‌కు చెందిన వారు కావడంతో ఆ పార్టీ బలం 29కి చేరుకుంటుంది. మిగిలిన ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు బీజేపీకి చెందిన వారు. వారి ఓట్లతో బీజేపీ బలం కూడా 29 వద్ద ఆగిపోతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు దక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు మూడు ఓట్ల దూరంలో ఆగిపోతుండడంతో నాలుగు డివిజన్లు గెలిచిన జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారింది.
Also Read : కొత్త వేషం.. ఉత్తుత్తి రోషం.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ..
కింగ్ అవ్వాలనుకుంటున్న జేడీఎస్..
ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడం, జేడీఎస్ మద్ధతు తప్పక అవసరం కావడంతో.. ఆ పార్టీ కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవ్వాలనుకుంటోంది. జేడీఎస్ మద్ధతుతో పాలక మండలిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండు పార్టీలు జేడీఎస్‌తో కలసి పాలక మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఈ సమయంలో తెరపైకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమార స్వామి కీలక ప్రకటన చేశారు. ఎవరైతే మేయర్ పీఠం ఇస్తారో.. ఆ పార్టీకే మద్ధతు ఇస్తామని ప్రకటించడంతో కుల్బర్గా మున్సిపల్ పాలక మండలి ఏర్పాటు రసకందాయంలో పడింది.
అసెంబ్లీని గుర్తుకుతెచ్చేలా..
కుల్బర్గా మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న తంతు.. 2018 అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేస్తోంది. ఆ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారింది. కానీ చివరకు కింగ్ అయింది.
224 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా… బీజేపీ 104, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకోగా.. స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు. జేడీఎస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తోపాటు బీజేపీ ప్రయత్నించింది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం తనకు కావాలని షరతు పెట్టారు. ఈ షరతుకు ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని కుమారస్వామికి ఇచ్చి ప్రభుత్వంలో భాగమైంది. అయితే పలువురు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం 14 నెలలకే పడిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల తరహాలో కుల్బర్గాలోనూ మేయర్ సీటును అడుగుతున్న జేడీఎస్.. ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. అయితే.. అసెంబ్లీలో మాదిరిగా.. ఇక్కడ కూడా పీఠం మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం లేకపోలేదు. రేపటి సంగతి పక్కనపెట్టిన జేడీఎస్.. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలనుకుంటోంది. అందుకే మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి దేవెగౌడ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగవద్దని జేడీఎస్ తరఫున గెలిచిన నలుగురు కార్పొరేటర్లకు ఉద్బోధిస్తున్నారు.
Also Read : మమతను ఢీ కొట్టనున్న ప్రియాంక.. ఎవరీమె?