Idream media
Idream media
కారణాలు ఏమైతేనేం జై భీమ్ చూడడం, రాయడం రెండూ ఆలస్యమయ్యాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదని మొదట తమిళ్‌లో చూశాను. తిరుపతిలో చాలా కాలం వుండడంతో తమిళం కొంత అర్థమవుతుంది. సబ్‌టైటిల్స్ ఎలాగూ వుంటాయి. తర్వాత తెలుగులో చూశాను. నిజానికి ఈ సినిమాకి భాష అవసరం లేదు. కన్నీళ్లకి, కష్టాలకి భాష వుంటుందా? ప్రపంచమంతా ఒకే భాష.
OTT లో చెత్త సినిమాలే ఎక్కువ వస్తాయి కాబట్టి మధ్యలో Pause పెట్టి కాసేపు ఆగి చూడడం అలవాటు. ఈ సినిమాని అలాగే చూడాల్సి వచ్చింది. దృశ్యం అలుక్కుపోతున్నపుడు కళ్లు తుడుచుకుంటూ…
మళ్లీమళ్లీ చూశాను. ఏమీ రాయాలనిపించలేదు. ఏదో స్తబ్ధత. మెదడులో గడ్డ కట్టుకుపోయినతనం. సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. చాలా మంది రాసేశారు.
మార్క్స్ మాట ఒకటుంది —-ఈ ప్రపంచాన్ని వేదాంతులు చాలా రకాలుగా నిర్వచించారు, కానీ సమస్య ఏమంటే దీన్ని మార్చడం ఎలా?
దళితులు , సంచార జాతులు, ఆదివాసిలకి తగిలిన గాయాలు మానడం ఎలా?
జై భీమ్ కథ జరిగి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. కాలం చాలా మారిందని అనుకుంటాం. డిజిటల్ ప్రపంచం వచ్చేసింది. అన్ని పనులూ ఫోన్‌తో జరిగిపోతున్నాయి. సైన్స్ విశ్వరూపం చూస్తున్నాం. ఇన్ని మారుతున్నా పోలీసులు మారారా? మొన్న మరియమ్మ చనిపోయింది. నిన్న ఒక తండా యువకుడిని లాకప్‌లో చావబాదారు.
మనం భూమిని గజాల లెక్కన కొనుక్కుంటాం. సంచార జాతులు ఈ భూమండలమంతా తమదే అనుకుంటారు. ఒక పక్షి తన హక్కుగా ఎలాగైతే ఈ భూమ్మీద జీవిస్తుందో వాళ్లు కూడా అంతే. అడవి వాళ్లకి తల్లి.
బ్రిటీష్ వాళ్లు అటవీ చట్టం తెచ్చినపుడు వాళ్లకి అర్థం కాలేదు. సొంత ఆస్తి ఉండేవాళ్లకి చట్టాలు , వాళ్లకెందుకు? అడవుల్లో వుండ నివ్వరు, ఊళ్లలో బతకలేరు. బతుకు కోసం ప్రయత్నిస్తే దొంగలని ముద్రవేశారు. పేదవాళ్లే దొంగతనాలు చేస్తారని నమ్మే సమాజం మనది. వాళ్లకి క్యారెక్టర్ వుండదు, వుండే అవకాశం లేదని పెద్ద మనుషుల విశ్వాసం. నిజానికి డబ్బు, క్యారెక్టర్ వేర్వేరు విషయాలు. మెజార్టీ సందర్భాల్లో ఒకటి కావాలంటే ఇంకోటి ఎంతోకొంత వదులుకోవాలి. డబ్బు పోగు చేసుకున్న వాళ్లే క్యారెక్టర్ గురించి ఉపన్యాసాలు ఇస్తూ వుంటారు. ఇదో విచిత్రం, విషాదం.
80 -90 ప్రాంతాల్లో నల్లమలలో బస్సు దోపిడీలు జరిగేవి. నంద్యాల దగ్గర వాహనాలన్నీ ఆపి ఇద్దరు గన్‌మెన్‌లు ఎస్కార్ట్‌తో గిద్దలూరు వరకూ పంపేవాళ్లు. అయినా అప్పుడప్పుడు జరిగేవి. దోపిడీ జరిగిన ప్రతిసారి చెంచుల్ని తీసుకెళ్లి చావబాదేవాళ్లు. ఎంతో మంది జైళ్లలో మగ్గారు. గాయాలతో చనిపోయారు. అవిటివాళ్లు అయ్యారు.
పోలీసులు మోపుతున్న దొంగ కేసులపై విశ్వమోహన్‌రెడ్డి అనే రచయిత చతురలో నవల రాసే వరకూ ఈ అమానుషం బయటి ప్రాంతాల వాళ్లకి తెలియదు. తర్వాత విశ్వమోహన్‌రెడ్డిని నక్సలైట్‌గా అనుమానించి ఎన్‌కౌంటర్ చేశారు.
చిన్నప్పుడు రాయదుర్గంలో ఎరుకులవాళ్లు ఉండేవారు. ఈత చాపలు, బుట్టలు, బొమ్మలు అమ్ముకునే వాళ్లు. తిలకం కూడా చిన్నగాజు సీసాలో తెచ్చేవాళ్లు. సింగార్ , ఐటెక్స్ బొట్టు బిళ్లలు, తిలకం వచ్చే వరకూ ఊళ్లలో ఎరుకలవాళ్లు తయారు చేసిన తిలకాన్నే వాడేవాళ్లు. వాళ్లు మంచోళ్లు కాదు, దొంగలని చెప్పేవాళ్లు.
దొంగలైతే ఊరి బయట కాళ్లు చాపుకునే స్థలం కూడా లేని చిన్న గుడిసెల్లో పందులు మేపుకుంటూ ఎందుకుంటారో, పిల్లల ఒంటిమీద బట్టలు ఎందుకుండవో , చింపిరి బట్టల ఆడవాళ్ల మెడలో కాసింత బంగారం కూడా ఎందుకు లేదో అర్థమయ్యేది కాదు. పెళ్లిళ్లు జరిగినప్పుడు కుప్పతొట్టెలోని విస్తరాకుల కోసం కుక్కలతో సమానంగా పిల్లలు పోరాడేవాళ్లు.
లిపి కూడా లేని తమ భాషలో మాట్లాడుతూ, తమ ప్రపంచంలో జీవించే వీళ్లకి చరిత్ర లేదు. చరిత్రని విజేతలే రాస్తారు.
అమెరికాలో ఆప్రో అమెరికన్స్ (నల్లవాళ్లు అనడం తప్పు, నేరం) పై గొప్ప సాహిత్యం, పాటలున్నాయి. బానిసత్వ నిర్మూలన అనే అంశంపై ఆ దేశం రెండుగా విడిపోయి పెద్ద యుద్ధమే చేసింది. బానిసల హక్కుల కోసం కొన్ని లక్షల మంది తెల్లవాళ్లు చనిపోయారు.
మన దేశంలో దళితుల హక్కుల కోసం పోరాడిన రాజులు, జమీందారులు, పెత్తందారులు ఉన్నారా? పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, సుభాషితాలు, నీతిరత్నాకరాలు , ప్రవచనాలు, శాస్త్రాలు ఇన్ని వున్నాయి కదా, కులం పేరుతో ఒక మనిషి ఇంకో మనిషి పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదని , అన్యాయం, అధర్మమని ఎంతమంది రాశారు? ఎన్ని పుస్తకాలున్నాయి?
జాతి నాయకుల్లో అంబేద్కర్ ఎందుకు లేడని సూర్య అడుగుతాడు. దానికి సమాధానం వుందా? చిన్నపుడు స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వస్తే , స్కూల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకూ జేజేలు పలుకుతూ ఊరేగింపుగా వెళ్లాం. గాంధీ తాతకు జై, నెహ్రూ చాచాకి జై అన్నాం కానీ, అంబేద్కర్‌కి జై అని ఎప్పుడైనా అన్నామా? మాకెవరైనా చెప్పారా?
సోషల్ పుస్తకాల్లో రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అని మాత్రమే వుండేది. ఆయన జీవిత చరిత్రపై పాఠాన్ని మేమైతే చదువుకోలేదు. ఇపుడు మారిందేమో తెలియదు.
పసిపాప ఏడుపు వినిపిస్తూ వుంటే , ప్రారంభమయ్యే జై భీమ్ రెండున్నర గంటల పాటు కళ్లు తడుపుతూనే వుంది. సూర్య , ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ లాంటి పెద్ద నటులున్నా కళ్ల ముందు కనిపించేది సినతల్లి ఒకటే. నెలలు నిండిన అమ్మాయి చిన్న బిడ్డని చేత్తో నడిపిస్తూ న్యాయం కోసం చేసే పోరాటమే వెంటాడుతూ వుంటుంది.
కళ్లతోనే నటించే లిజోమోన్‌జోన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ దేశాన్ని పరిపాలించాలంటే క్రూరమైన పోలీస్ వ్యవస్థ వుండాలని బ్రిటీష్‌వాళ్లు నమ్మారంటే అర్థముంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా తెల్లవాళ్ల కంటే ఎక్కువగా మన వాళ్లు నమ్ముతున్నారు. ఇది విషాదం కాదు శాపం.
ఈ సినిమాలో పోలీస్ పాత్రలన్నింటిని నిజ జీవితంలో జర్నలిస్టుగా నేను చూశాను. 97లో ఒకసారి తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కి SIతో మాట్లాడ్డానికి వెళ్లాను. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక యువకుడిని SI ముందు నిలబెట్టాడు. మాసిపోయిన బట్టలతో చాలా కాలం తిండిలేనట్టు ఉన్నాడు. ‘
SI లాఠీ తీసుకుని అతన్ని ఇష్టమొచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేశాడు. అరుస్తున్నా, ఏడుస్తున్నా వదల్లేదు. మోకాళ్లు, చేతులు , భుజాలు ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు.
భరించలేక పైకి లేచాను. SI సైగతో కానిస్టేబుల్ ఆ యువకుడిని తీసుకెళ్లాడు. ‘ భయపడ్డావా? ఇవేం దెబ్బలు, క్రైమ్ స్టేషన్‌లో కొట్టడం చూస్తే కళ్లు తిరిగి పడిపోతావ్’ SI నవ్వుతూ అన్నాడు.
నేను భయపడింది దెబ్బల్ని చూసి కాదు, అంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న SI ఇంకో పాతికేళ్లు సర్వీస్‌లో వుంటాడు. అదీ భయం.
తర్వాత తిరుపతి క్రైమ్ స్టేషన్ SIగా నా ఇంటర్ క్లాస్‌మేట్ ఒకడొచ్చాడు. దొంగతనాల రికవరీ గురించి అడిగితే నిజంగానే కళ్లు తిరిగాయి.
దొంగతనం జరిగిన ఇంటిస్థాయిని బట్టి వుంటుంది విచారణ. బాగా డబ్బున్న వ్యక్తి ఇంట్లో జరిగితే వేలిముద్రల సేకరణ పక్కన పెడితే మొదట ఆ ఇంటి పనిమనుషులు, కుక్, డ్రైవర్ వీళ్లందర్నీ విచారిస్తారు. అంటే స్టేషన్‌కి తీసుకొచ్చి తన్నడం. వీళ్లలో ఎవరికైనా కాసింత డబ్బు, ఛోటా నాయకుల పరిచయం వుంటే వాళ్లు రంగంలోకి దిగి కొంత డబ్బు తాము తిని, కొంచెం పోలీసులకు ఇచ్చి కొట్టకుండా కాపాడతారు. ఏ అండా లేని వాళ్లు దెబ్బలు తింటారు. చాలా కేసుల్లో వీళ్లు దొంగలై వుండరు. ఒకవేళ చేసినా చాలా సులభంగా దొరికిపోతారు. ఎందుకంటే పోలీసులు ఒకే ప్రశ్నని రకరకాలుగా అడుగుతారు. అబద్ధాలు చెప్పేవాళ్లు దొరికిపోతారు.
డబ్బులొస్తే ఖర్చు పెట్టడం మానవ స్వభావం కాబట్టి, వీళ్ల జీవనశైలిపైన పోలీసులు నిఘా వేస్తారు. విందులు, విలాసాలు చేస్తున్న వాళ్లని పట్టేసుకుంటారు. వీళ్లు దొంగలు కాదని తేలితే ఏం చేస్తారంటే ఆల్రెడీ దొంగతనం కేసుల్లో జైలుకి వెళ్లిన వాళ్లని పట్టుకొచ్చి చితకబాదుతారు. అంటే ఒక వ్యక్తి దొంగతనం మానేసి గౌరవంగా బతుకుతామని ఆటో నడుపుతూ వుంటే , వాడు ఆ ఆటో అమ్మేసి, డబ్బులు పోలీసులకిచ్చి కేసు నుంచి బయటపడతాడు. అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక మళ్లీ దొంగతనం చేస్తాడు. దొంగలు దొంగతనాలు మానేస్తే పోలీసులకే ఎక్కువ నష్టం.
అసలు దొంగలు దొరకనే లేదనుకుంటే, వేరే ఏదో కేసులో దొరికిన బంగారాన్ని రికవరీగా చూపించి , చేసిన నేరానికి బదులు చేయని నేరాన్ని మోపి పైనుంచి వచ్చే ప్రెజర్ నుంచి బయటపడతారు. అసలు బంగారు నగలు దొరకవు కాబట్టి, జ్యువెలర్ దుకాణం నుంచి కొత్తవి కొని రికవరీ చూపిస్తారు. నగలు స్వాధీనం అని విలేకరులు ఫొటోలు తీసుకుంటారు కానీ, ఆ నగలు బ్రాండ్ న్యూగా ఎందుకున్నాయని అడగరు. అన్ని వూళ్లలో బంగారు వ్యాపారులు, కుదువ వ్యాపారుల సంఘాలు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఎందుకుంటారంటే పోలీసు తాకిడిని ఎదుర్కోడానికే.
సాధారణమైన వ్యక్తుల ఇంట్లో చోరీ జరిగితే చోరీ విలువని తక్కువగా నమోదు చేయించుకుంటారు. ఎక్కువ విలువైన దొంగతనాల కేసుల్ని ప్రతినెలా క్రైమ్ మీటింగ్‌ల్లో సమీక్షిస్తారు. SP అడుగుతాడు కాబట్టి. అనేకమార్లు మనం స్టేషన్ చుట్టూ తిరిగితే అదృష్టం బాగుంటే రికవరీ జరగొచ్చు.
అమాయకులపైన కేసులు ఎందుకు పెడతారంటే అర్జెంట్‌గా రికవరీ చూపించాలనుకుంటే అసలు నేరస్తుడు దొరకనప్పుడు, ఎవడో ఒకడి మీద బనాయిస్తారు. తిరుపతి బస్టాండ్‌లో దిక్కూమొక్కూ లేకుండా నిద్రపోతున్న వాళ్లు ఎందరో ఈ రకంగా బలయ్యారు. ఈ మధ్య ఒక అమాయకునికి 3 రోజులు వరుసగా బిర్యానీ తినిపించి , నాలుగో రోజు సెల్‌ఫోన్ Theft కేసులో జైలుకు పంపారు. అసలు నేరస్తుడు ఒక పోలీస్ కొడుకు. అతన్ని తప్పించి ఇతన్ని వేశారు. రాయలసీమ జలాల కోసం పోరాడుతున్న కొందరు మిత్రులు జైలుకెళితే ఈ విషయం తెలిసింది.
ఈ క్రైమ్ మిత్రుడు ఒక్కోసారి ఎమోషనల్‌గా ఏడ్చేసేవాడు. అతను ఒక నకిలీ ఎన్‌కౌంటర్ చేశాడు. అతను పనిచేస్తున్న ఏరియాలో గతంలో పోలీసులపై నక్సలైట్ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఒక సానుభూతిపరుని పట్టుకున్నారు. నిజానికి అతనికి ఏ సంబంధమూ లేదు. కుండలు చేసుకుని అమ్ముకునే పేదవాడు.
జీపులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అతను కాళ్లావేళ్లా పడి ఏడ్చాడు. చిన్న కూతురు వుంది, భార్య గర్భవతి (జై భీమ్ సినిమాలో సినతల్లిలా). వదిలేయండి అన్నాడు. నా మిత్రుడు సున్నితమైన వాడు. కాల్చలేకపోయాడు. అతని వెంట ఓ రిజర్వ్ కానిస్టేబుల్ వున్నాడు.
‘భయపడేవాళ్లు డిపార్ట్‌మెంట్‌కి రాకూడదు’ అని SIని తోసేసి, కాల్చేశాడు. చంద్రు లాంటి లాయర్ వుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదేమో!
‘ఆ పాపని నేను చదివించి ఉండాల్సింది’ అన్నాడు నా మిత్రుడు. అది జరగలేదు. 45 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయాడు. అపరాధ భావనే అనారోగ్యంగా మారిందేమో!
సైంటిఫిక్ పద్దతులు ఎన్ని వున్నా పోలీసులు నేర పరిశోధనలో ఇప్పటికీ లాఠీనే నమ్ముతున్నారు. పోలీసుల్లో మంచోళ్లు లేరని కాదు. లాకప్‌లో వాళ్లకి సొంత డబ్బులతో భోజనాలు పెట్టించే పోలీసులున్నారు. యాక్సిడెంట్లో కూతురిని పోగొట్టుకున్న ఒక పోలీస్ అధికారి సర్వీస్‌లో ఉన్నంత కాలం యాక్సిడెంట్ కేసుల్లో పైసా తీసుకోలేదు. కొట్టకపోతే నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలి అని కొందరు ప్రశ్నిస్తూ వుంటారు. పోలీస్‌స్టేషన్లు పుట్టినప్పటి నుంచి కొడుతూనే వున్నారు. నేరాలు తగ్గాయా? పోలీస్‌స్టేషన్లకు ఎర్ర రంగు తొలగించారు కానీ , పేదలు, దళితులు , గిరిజనుల్ని హింసించే కొద్దీ అవి మరింత ఎరుపు రంగుకి మారిపోతున్నాయి.
జై భీమ్ చూస్తున్నప్పుడు బాలగోపాల్, చంద్రశేఖర్‌లాంటి మానవ హక్కుల లాయర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.