Ponguleti, Banda Prakash – రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్సీ.. ఆ స్థానంలో సీనియర్‌ నేత..? కేసీఆర్‌ వ్యూహాలు

తెరాస నుంచి రాజ్యసభ ఎంపీగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటంతో ఎమ్మెల్యే కోటా లో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు దాదాపుగా ఏకగ్రీవం అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే కోటా లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తక్కెళ్లపల్లి రవీందర్ రావు అలాగే సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అలాగే మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ హుజురాబాద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పాడి కౌశిక్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. అయితే ఈ ఎంపికలో ప్రధానంగా ఆశ్చర్యపరిచింది బండ ప్రకాష్ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే. అయితే ఇప్పుడు బండ ప్రకాష్ స్థానంలో రాజ్యసభకు వెళ్లేది ఎవరు ఏంటీ అనే దాని పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లే అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు గత కొన్ని రోజులుగా వినపడుతున్నా సరే ఆయనకు ఎటువంటి పదవి కూడా టిఆర్ఎస్ పార్టీలో దక్కలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ చేయడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉందని అలాగే రాజ్యసభకు కూడా వెళ్లే అవకాశం ఉందని దాదాపుగా ఏడాది నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి స్థానంలో ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని అందరూ భావించారు.

కానీ ఆయన విషయంలో సీఎం కేసీఆర్ అంతగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ ను రాజ్యసభకు రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజ్యసభకు పంపడం ఖరారైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఆయనకు మంచి వర్గం ఉండటమే కాకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ఎంపీగా విజయం సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయనను సీఎం కేసీఆర్ వదులుకోడానికి ఇష్టపడలేదు అని అంటున్నారు.  ఆయన షర్మిల పార్టీ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనతో మాట్లాడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్ సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దాదాపుగా రాజ్యసభకు పంపిస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెరాస పార్టీలో మరో అసంతృప్తి నేత దాదాపుగా లేకపోవడంతో సిఎం కేసీఆర్ పొంగులేటిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా సరే ఆయన పెద్దగా ప్రభావం చూపించే నాయకుడు కాదనే భావనలో సిఎం ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ మంత్రిగా ఉండగా నామా ఎంపీగా ఉన్నారు. ఈ జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి పొంగులేటిని రాజ్యసభకు పంపిస్తే లెక్క సరిపోతుందని సిఎం అంచనా వేస్తున్నారు.

Also Read : Telangana MLC Elections -ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్న బీజేపీ

Show comments