TRS – న‌మ‌స్తే తెలంగాణ ఎండీకి రాజ్య‌స‌భ సీటు?

బండ ప్రకాష్ తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయ‌న రాజ్యసభ సభ్యత్వానికి ఇటీవ‌ల రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి రాజీనామా లేఖను అందచేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ప్రకాష్. 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడేళ్ళ పదవి కాలం మిగిలి ఉండగానే ప్రకాష్ రాజీనామా చేశారు.
బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారో అన్న ఆసక్తి ఏర్ప‌డింది.

బండ ప్ర‌కాష్ రాజీనామాతో ఖాళీ అయిన పదవి ఎవరికి దక్కుతోందోనన్న చర్చలు కొనసాగుతున్నాయి. రేసులో మూణ్నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన కుటుంబానికే చెందిన ఓ వ్యక్తికి కేసీఆర్ ఆ పదవి కట్టబెట్టబోతున్నారని సమాచారం. నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావును కేసీఆర్ ఖరారు చేశారని అంటున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానల ఎంపిక పూర్తయింది. అందులో ఒక స్థానాన్ని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్కు కట్టబెట్టారు. దీంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈటల రాజేందర్ వెళ్లిపోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడితో భర్తీ చేయాలని ప్ర‌కాశ్ ని ఎమ్మెల్సీని చేశారు. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు కేసీఆర్ తనయ కవితను పంపిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి చూపించిన ఆమె మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. కవిత రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇక ఇతర నాయకుల పేర్లపై కేసీఆర్ దృష్టి సారించారు.

మిగిలిన మూడేళ్ల పదవి కాలం కోసం ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి సీనియర్ నాయకుల పేర్లు వినిపించాయి. కానీ ఆయన తన బంధువుకే ఆ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అందుకే దామోదర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతేడాదే ఆయన్ని రాజ్యసభకు పంపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదని తెలిసింది. కానీ ఇప్పుడు ఆయనకు ఆ పదవి పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments