Kcr delhi tour – కేసీఆర్ ఢిల్లీ టూర్ విప‌క్షాల‌కు అస్త్రంగా మారిందా?

కేంద్రంతో పోరాటానికి దిగిన తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కానీ కేంద్ర పెద్ద‌లు ఎవ‌రితోనూ భేటీ కాలేదు. వరి రాజకీయంతో ప్ర‌ధాన‌మంత్రితో తాడో పేడో తేల్చుకుని వస్తానని శపథం చేసిన కేసీఆర్ ఏకంగా ఎంపీలు, మంత్రుల బృందంతో ఢిల్లీకి వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్క‌డే ఉన్నా మోదీని కాక‌పోయినా అమిత్ షాతో కూడా భేటీ కాలేక‌పోయారు. ఒకరిద్దరు కేంద్రమంత్రులతో మాత్రమే రాష్ట్రమంత్రులు సమావేశమయ్యారంతే. మరి అంత పెద్ద బృందాన్ని వేసుకుని ఢిల్లీకి వెళ్ళిన కేసీయార్ అక్క‌డ ఏం చేశారు? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కనీసం కేంద్ర మంత్రులను కూడా కలవలేదు. కేంద్ర మంత్రులను కలిసింది రాష్ట్రమంత్రులు మాత్రమే. అందుకనే ఈ విషయాలన్నింటినీ గుర్తుచేస్తు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. కేవలం విందు రాజకీయం చేయటానికి మాత్రమే కేసీయార్ ఢిల్లీకి వెళ్ళినట్లు రేవంత్ విరుచుకుపడుతున్నారు. రేవంత్ ఆరోపణలకు మంత్రులు టీఆర్ఎస్ నేతలు సరైన సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. నాలుగు రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన కేసీయార్ ఏమి చేశారని మామూలు జనాలు కూడా చర్చించుకుంటున్నారు. రాజకీయంగా తన ప్రత్యర్ధులకు కాకపోయినా కనీసం జనాలకైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీయార్ మీద ఉంది. ఢిల్లీలో ఫ్లాపైన కేసీయార్ హైదరాబాద్ కు తిరిగి రాగానే రైతులను కేంద్రంపైకి రెచ్చగొడుతున్నారు.

అమిత్ షా, మోదీల‌ను కలవటానికి ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోకుండానే కేసీయార్ ఢిల్లీకి వెళ్ల‌డంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండగానే వాళ్ళతో అపాయింట్మెంట్ అడిగినా వాళ్ళదగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అపాయింట్మెంట్ దొరక్కపోయినా నేరుగా వెళ్ళిపోతే వాళ్ళే తనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆహ్వానిస్తారని కేసీయార్ ఎలాగ అనుకున్నారో అర్ధం కావటం లేద‌నేది విప‌క్షాల వాద‌న‌. హైదరాబాద్ లో కూర్చుని కేంద్రాన్ని నోటికొచ్చినట్లు తిట్టేసిన తర్వాత కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ద‌క్కుతుందా అనేది ముందు నుంచీ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అసలు బాయిల్డ్ రైస్ కొనేదే లేదని తేల్చిచెప్పేసిన కేంద్రంతో కేసీయార్ ఏ విధంగా కొనిపించగలరు ? రా రైస్ తప్ప దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ బాయిల్డ్ రైస్ కొనేవాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. అన్నీ తెలిసీ కేసీయార్ ప్రకటించిన యుద్ధం చివరకు ఏమైందో ఆయనే చెప్పాల‌ని విప‌క్షాలు పాయింట్ లేవ‌నెత్తుతున్నాయి.

Show comments