Idream media
Idream media
రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది మేమే అని ఒకరు.. అంతకు ముందే ప్రభుత్వం పడిపోతుందని మరొకరు.. ఈ మధ్యకాలంలో ఇటువంటి స్టేట్ మెంట్లు ఏపీలో తెగ వినిపిస్తున్నాయి. అలా మాట్లాడేవారెవరూ అందుకు సరైన కారణాలు కానీ, వివరాలు కానీ చెప్పడం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ స్టేట్ మెంట్లు ఇస్తున్న పార్టీ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా పత్తా ఉండడం లేదు. పోనీ ప్రభుత్వం పడిపోవడానికి ఏపీలో శాంతి భద్రతలు ఏమైనా క్షీణించాయా అంటే అస్సలే లేదు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. వైసీపీకి ప్రజలు అందిస్తున్న విజయాలను పరిశీలిస్తే జగన్ పై గెలుపు అంత ఈజీ కాదని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం పవర్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నాయి.
మహా అయితే రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. అప్పుడు అధికారంలోకి వచ్చేది ఎవరో ఇప్పుడే చెప్పేస్తున్నారు. విపక్ష నేతలు మాత్రం జగన్ ఉండేది మరో రెండేళ్ళు మాత్రమే అంటున్నారు. జగన్ ఏపీ మాజీ సీఎం గా మిగిలిపోతారని కూడా జోస్యం చెబుతున్నారు. కొందరు ఉత్సాహవంతులైన రాజకీయ నేతలు అయితే 2023 నాటికి జగన్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని కూడా జాతకం చెప్పేస్తున్నారు. కొత్త తరహా పవర్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు కానీ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గమనిస్తున్న వారు మాత్రం వారి ప్రకటనలు విని నవ్వుకుంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మరో రెండేళ్ల తరువాత ఏపీలో వైసీపీ సర్కార్ ఉండదని అనేస్తున్నారు. విశాఖతో సహా ఉత్తరాంధ్రాను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరి మీద ఉందని రెండేళ్ల తరువాత ఇంటికి వెళ్ళిపోయే వైసీపీ ప్రభుత్వానికి ఏం బాధ ఉంటుందని కూడా అయ్యన్న లాంటి వారు సెటైర్లు వేస్తున్నారు.
Also Read : విపక్షాల నోళ్లకు తాళం.. వెలిగొండపై జగన్ స్పష్టత
టీడీపీకి విశాఖ ఆయువు పట్టులాంటిది. జగన్ సునామీలో కూడా గత ఎన్నికల్లో ఆ పార్టీకి అక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి మారింది. రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జనం వైసీపీకి పట్టం కడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ విషయం రుజువైంది. అది చూసి కూడా అయ్యన్న అలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే 2023లోనే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యాలు వదులుతున్నారు. మరి 2023లో ఏ పరిణామాలు జరుగుతాయి. ఎందుకు జగన్ సర్కార్ పడిపోతుంది అన్న దానికి ఆయన సరైన ఆధారాలు కానీ సమాచారాన్ని కానీ చెప్పడం లేదు.
ఏపీలో తాజా పరిస్థితులతో టీడీపీ అధినాయకత్వానికి లోలోపల గుబులు ఉన్నప్పటికీ వచ్చేది మా సర్కారే అంటూ కొందరు మంత్రి పదవుల కోసం హడావుడి మొదలెట్టిన వారూ ఉన్నారు. బాబు క్యాబినెట్ లో హోమ్ మంత్రిని నేనే అని ఆ మధ్యన అచ్చెన్నాయుడు బాహాటంగానే చెప్పేశారు. వన్ టైం సీఎం జగన్ అని తమ్ముళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యన ఏపీలో టూర్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే 151 సీట్లు వచ్చిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు వస్తే గొప్పేనని సంచలన వ్యాఖ్యలే చేశారు. జగన్ మాజీ సీఎం అని కూడా పేర్కొన్నారు.
కానీ జగన్ని ఓడించడం అంత సులువా. లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నింటా గెలిచిన వైసీపీ ని ఇంత ఈజీగా ఎందుకు విపక్షాలు పక్కన పెడుతున్నాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. మరో వైపు చూస్తే బద్వేల్ ఉప ఎన్నికల వేళ మేము పోటీకి దూరం అంటున్న విపక్షాలు జగన్ ను మరో రెండేళ్ళలో ఓడిస్తామంటే సొంత పార్టీ క్యాడర్ అయినా నమ్ముతుందా అనేది సందేహమే.
Also Read : కొత్త ట్రెండ్‌ను సృష్టించిన వైఎస్ జగన్