మాజీ ఎంపీ వివేక్ తెరాస కు దగ్గరవుతున్నాడా ?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రాజ‌కీయంగా పెద్ద యుద్ధ‌మే చేస్తున్నాయి. ఇరు పార్టీల నేత‌లు స‌వాళ్లు – ప్ర‌తి స‌వాళ్ల‌తో వేడి పుట్టిస్తున్నారు. హుజూరాబాద్ లో అయితే మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌చారంలో ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. బీజేపీ టార్గెట్ గా హ‌రీశ్ చెల‌రేగిపోతున్నారు. అలాంటి హ‌రీశ్ రావు.. బీజేపీ నేత వివేక్ వెంక‌ట స్వామితో భేటీ అయ్యారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీనేత వివేక్ వెంకటస్వామి ఇంటికి మంత్రి హరీశ్ రావు తాజాగా వెళ్లినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత్యంత రహస్యంగా సాగిన ఈ సమావేశం సాగిన‌ట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. వివేక్ వెంకటస్వామికి బలమైన సొంత మీడియా సంస్థ ఉందన్న విషయం తెలిసిందే. వీ6 చానల్ తో పాటు..వెలుగు పేపర్ కూడా ఆయనదే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత అస్త్రాన్ని సంధిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని అమలు చేయటమే కాదు.. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ ను ఎంపిక చేసుకోవటం తెలిసిందే.

అదే సమయంలో.. కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. వివేక్ మద్దతును హరీశ్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న వివేక్.. పార్టీ కోసం తనశక్తి మేర సాయం చేస్తున్నా.. అందుకు తగిన గుర్తింపు లభించటం లేదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?

దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల మంచి చెడ్డలు చూసుకోవటంలో వివేక కీలక భూమిక పోషించినట్లు చెబుతారు. ఇందుకు భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయినప్పటికీ ఎలాంటి పదవి రాకపోవటం.. ఆయన ఆశించిన రాజ్యసభ సీటును కేటాయించే విషయంలో సరైన హామీని ఇవ్వని నేపథ్యంలో.. ఆయన్ను గులాబీ కారు వైపు తిప్పేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు.

కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళలో.. వివేక్ ను పార్టీ నుంచి తప్పించి.. టీఆర్ఎస్ తీర్థం కాని ఇప్పిస్తే.. సమీకరణాల్లో మార్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది.

దళిత నేతగా గుర్తింపు ఉన్న వివేక్ లాంటి నేత పార్టీలోకి తీసుకురాగలిగితే.. పరిణామాలు వేరుగా ఉంటాయన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే మంత్రి హరీశ్ ను వివేక్ ఇంటికి పంపినట్లుగా చెబుతున్నారు. ఈ సాయానికి బదులుగా ఆయన కోరుకుంటున్న రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. దీనిలో వాస్త‌వం ఎంత అనేది తెలియాలంటే వివేక్, హ‌రీశ్ స్పందించాల్సిందే.

Also Read : స్పీకర్‌ కుటుంబంలో వారసత్వ పోరు

Show comments