Idream media
Idream media
అవమానకరరీతిలో ప్రభుత్వం తనను బర్తరఫ్ చేసిందంటూ మొదటి నుంచీ చెబుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సర్కారుపై ఈటెల్లాంటి మాటలు వదులుతూనే ఉన్నారు. అధికార పార్టీ ఎంతలా ప్రయత్నించినా తన హుజురాబాద్ లో విజయఢంకా మోగించిన ఈటల.. అక్కడి నుంచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ ప్రాభవం తగ్గించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత జిల్లా కరీంనగర్ నుంచే తన ప్రణాళికను అమలు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎ స్ కు వ్యతిరేకంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీని వెనుక ఈటల ఘననీయమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కు పెట్టని కోటలా ఉండేది. గులాబీ పార్టీకి జిల్లాలో తిరుగులేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎదురుగాలి వీస్తోంది. అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలపై కాషాయపార్టీ కన్నేసింది. టీఆర్ఎస్ ను వ్యతిరేకించి పోటీలో ఉన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు ఈటల రాజేందర్ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల రవీందర్ సింగ్ కు అనుకూలంగా మాట్లాడడంతో ఆయనకు బీజేపీ మద్దతు ఉన్నదని ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. గతంలో బీజేపీలో ఉన్న రవీందర్ సింగ్ టిఆర్ఎస్ లోచేరారు. ఇప్పుడు ఆయన తిరిగి తన మాతృసంస్థకు వెళ్తున్నారని చెబుతున్నారు. టిఆర్ఎస్ లో అసంతృప్తివాదుల మద్దతును ఈటల కూడగడుతూ ఎమ్మెల్సీ స్థానాన్ని రవీందర్ సింగ్ కు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా తన పట్టును ప్రదర్శించుకొని టిఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. రవీందర్ సింగ్ కు అండగా కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ లో తనకున్న పరిచయాలతో సభ్యుల మద్దతును ఈటల కోరుతున్నట్లు సమాచారం. రవీందర్ సింగ్ కు బీజేపీ నుంచి మద్దతు ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలయింది. స్థానిక ప్రజా ప్రతినిధులను ఇప్పటికే క్యాంపుకు తరలించారు. మంత్రి గంగుల కమలాకర్ ఎవరూ చేజారకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.టిఆర్ఎస్ లోని అసంతృప్తివాదులు కాంగ్రెస్ బీజేపీ ఇతర స్వతంత్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రవీందర్ సింగ్ కు మద్దతు తెలుపుతున్నారని చెబుతున్నారు.
ఈటల అడుగుపెట్టడంతో కేటీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కేటీఆర్ రంగంలోకి దిగి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టిసారించారని చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సభ్యులను క్యాంపులకు తరలించారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 1324 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 996 మంది టీఆర్ఎస్ కు చెందినవారే. వీరందరిని బెంగుళూరు తరలించారని చెబుతున్నారు. మహిళా సభ్యుల వెంట వారి భర్తలు లేక కుటుంబసభ్యులు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రవీందర్ సింగ్ బరిలో ఉండడంతో గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భవిష్యత్ కోసం జిల్లాలో బీజేపీ గట్టి పునాది వేసేలా ఈటల విశేషంగా కృషి చేస్తున్నారు. మరి మున్ముందు కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఎలా మారనున్నాయో వేచి చూడాలి.