Idream media
Idream media
హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు విస్తృత స్థాయి కమిటీలు అంటూ టీఆర్ఎస్ అధిష్ఠానం తెగ హడావిడి చేసింది. సంస్థాగతంగా పార్టీని మరింత బలపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జెండా పండగను కూడా ఘనంగా నిర్వహించింది. అనంతరం పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డెడ్ లైన్లు విధించి మరీ గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు.. అనంతరం మండల, పట్టణ కమిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చాలా చోట్ల కమిటీల నియామకం కూడా జరిగింది. గ్రేటర్ లో వార్డు కమిటీల నియామకాల్లో అయితే పెద్ద రచ్చే జరిగింది.
సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని టీఆర్ఎస్ అగ్ర నేతలు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ ఊసే లేదు సరికదా.. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. టీఆర్ఎస్ లో జిల్లా అధ్యక్ష పదవులకు మంగళం పాడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరం గా జిల్లా మొత్తం అధ్యక్షుల చేతి లో ఉంటుంది. అధ్యక్షులు గా జిల్లాను ఏలాలని నేతలు అనుకోవడం సహజమే. అయితే గులాబీ పార్టీ కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి గ్రామం లో విద్యార్థి యువజన మహిళా కార్మిక తదితర అనుబంధ సంఘాల ను ఎన్నుకున్నారు. గతం లో లాగే జిల్లా అధ్యక్షులను కూడా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక కమిటీలను జిల్లా అధ్యక్షులే పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో జిల్లా అధ్యక్షులే కీలకం. అయితే జిల్లా స్థాయిలో పార్టీకీ అధ్యక్షులు ఉండాలా… లేక కో ఆర్డినేటర్ ఉంటే బెటరా? అని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గులాబి నేతలు సుదీర్ఘంగా చర్చించి పాత విధానానికి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా స్థాయి లో అధ్యక్షుల కంటే కో ఆర్డినేటర్ ఉంటే మంచిదనే ఆలోచనకు వచ్చినట్లు కొందరు నేతలు చెబుతున్నారు.
జిల్లా అధ్యక్షులు ఉంటే గ్రూపు రాజకీయాలు తగదాలు ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇవన్నీ పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే భావనలో గులాబీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సహజంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేనే స్థానికంగా బాస్. ఒక వేళ జిల్లా అధ్యక్షుల నియామకం చేపడితే రాజకీయంగా సమస్యలు రావచ్చనే అభిప్రాయంతో టీఆర్ఎస్ నేతలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది చాలా మందిలో నిరుత్సాహానికి కారణమవుతోంది. సంస్థాగత ఎన్నికల సందడి మొదలు కాగానే ఆశావాహులు జిల్లా అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లోనూ ఈ కమిటీల నిర్ణయాలు కీలకంగా ఉండనుండటంతో పార్టీ పదవుల పై తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారు పదవికాలం ముగుస్తున్న నేతలు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. చివరి నిమిషంలో అధిష్టానం నిర్ణయం మార్చుకుందన్న ప్రచారంతో పదవులు ఆశించిన నేతలు నిరాశకు గురవుతున్నారు.
Also Read : Bjp Central Minister,Warns To Kcr -ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కేసీఆర్ కు కేంద్రం వార్నింగ్…?