Idream media
Idream media
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్‌ను తెలంగాణలో అయినా పటిష్టం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా గతంలో కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉండి.. ప్రస్తుతం దూరంగా, ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్లపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా డీఎస్ కు ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు డీఎస్ రేపు సోనియాతో భేటీ కానున్నారు.
గతంలో రేవంత్ రెడ్డితో పాటు.. హుజూరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా డీఎస్‌ను కలిశారు. ఈ క్రమంలో డీఎస్ బీజేపీలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. దీనికి తోడు.. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి కూడా వెళ్లొచ్చనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.ఓ చానల్ ఇంటర్వ్యూలో డీఎస్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తప్పు చేశానని అన్నారు.
టీఆర్ఎస్‌లోకి ప్రవేశం ఇలా..
డీఎస్ ఆషామాషీ నాయకుడు కాదు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగారు కూడా.అప్పట్లో కాంగ్రెస్‌లో కీలక నాయకుడు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్ స్వయంగా డీఎస్ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు.
కొంతకాలంగా కారుకు దూరం
ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక, పార్టీని వీడిన కాంగ్రెస్ సీనియర్ నేతలను మళ్లీ వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్ తన ఇంట్లోనే ప్రమాదానికి గురికావడంతో డాక్టర్లు ఆయనకు సర్జరీ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. ఆ సందర్భంగానే ఆయనను రేవంత్ కూడా పార్టీలోకి కూడా ఆహ్వానించారు. దీనిపై డీఎస్ సానుకూలంగా స్పందించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. జీహెచ్ఎంసీ లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా ఉన్న డీఎస్.. మేయర్ ఎన్నికకు హాజరు కాలేదు. దీంతో ఆయన అధికార పార్టీకి పూర్తిగా దూరం అయినట్లే అని తేలిపోయింది. ఇప్పుడు సోనియా పిలుపుతో డీఎస్ కాంగ్రెస్‌లో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.