Idream media
Idream media
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం దేవుడెరుగు.. అధినేత చంద్రబాబునాయుడు సహా ప్రముఖుల పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరూ తమను గెలిపించే నియోజకవర్గం కోసం రాష్ట్రమంతా వెదుకులాడుతున్నారు. గతంలో పోటీ చేసిన స్థానం ఓకేనా, లేక మారితే మంచిదా అనే ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే.. ఈసారి చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మారిన పరిస్థితుల్లో సేఫ్ సైడ్ చూసుకుంటే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పం నుంచి అప్రహతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై మధన పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్ల మీద నివేదికలు తెప్పించుకుని మరీ ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మొదటి సారి చంద్రగిరి నుంచి పోటీ చేసి 1978లో గెలిచారు. అదే సీటు నుంచి 1983లో కాంగ్రెస్ తరఫున మంత్రిగా పోటీ పడి అపుడే మామ ఎన్టీయార్ పెట్టిన టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో బాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక 1989 ఎన్నికల నాటికి బాబు కుప్పం కి మకాం మార్చేశారు. దాంతో బాబుకు కుప్పంతో వీడని బంధం ఏర్పడింది.
కుప్పం నుంచి వరుసగా బంపర్ మెజార్టీతోనే విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ బాబు మెజార్టీపై పడింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే మెజార్టీ కాస్త తగ్గింది. దీంతో పాటు పలు కారణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ పార్టీలో కూడా ఉంది. నిజానికి ఈ చర్చ రావడానికి కారణం నానాటికీ కుప్పంలో టీడీపీ బలహీనం అవుతూండడమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నింటినీ కైవశం చేసుకుని బలంగా తయారైంది. దాంతో ఈసారి చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది అన్న టాక్ కూడా ఉంది.
తాజా సమీకరణాలతో చంద్రబాబు కుప్పం సీటు నుంచి బయటపడి వేరే చోటు ఎంచుకుంటారా, లేక రెండు స్థానాల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రేమంలో విశాఖ నుంచి టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబుని ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేయమని కోరుతున్నారట. ఉత్తరాంధ్రాకు ముఖ ద్వారంగా ఉన్న విశాఖ నుంచి బాబు పోటీ చేస్తే మూడు జిల్లాల్లో మంచి ఊపు వస్తుంది పార్టీకి కూడా ప్లస్ అవుతుంది అని సూచిస్తున్నారుట. నిజానికి విశాఖ సిటీ టీడీపీకి కంచుకోట. దాంతో బాబు కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. కుప్పం సీటుతో పాటు విశాఖ సిటీ నుంచి ఏదో చోటు నుంచి పోటీకి బాబు రెడీ అంటున్నారు. విశాఖ నార్త్ నుంచైనా లేక భీమిలీ నుంచి అయినా బాబు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేదా సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు ఆ రెండు స్థానాల్లో ఒక చోటు నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.