Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తెస్తోంది. ఏపీలో జగన్ ను ఒంటరిగా ఎదుర్కునే సత్తా ప్రస్తుతం ప్రతిపక్షాలకు లేదనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పొత్తులు తప్పవని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రస్తుతం ఒంటరిగానే ఉంది. జనసేన – బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఇతర పార్టీల సహకారం తప్పనిసరి. 2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. అది టీడీపికి కలిసి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి బొక్కబోర్లా పడింది. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల్లో బలంగా నాటుకుపోయిన వైసీపీని ఎదుర్కోవడం ఇప్పుడు టీడీపీ వల్ల అసలే కాదు.
గత ఎన్నికల్లో ప్రతీ పార్టీ ఎవరి దారిలో అవి పయనించాయి. ఇది టీడీపీ, జనసేన, బీజేపీకి కలిసి రాలేదు. వైసీపీ బంపర్ మెజార్టీ దక్కించుకుంది. అయితే.. జనసేనకు సీట్లు రాకపోయినా.. ఓట్ల శాతం బాగానే కనిపించింది. జనసేన అధినేత పవన్ రెండు స్థానానాల్లో పోటీ చేసినా ఓడిపోయారు. టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి. గెలుపు గుర్రాలు అనుకున్న నాయకులు ఓటమి పాలయ్యారు. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే.. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు.. 44 సీట్లలో జనసేన 20-35 శాతం ఓట్లు చీల్చిందనే అంచనాలు వచ్చాయి. ఇవన్నీ.. టీడీపీ ఓట్లేనని.. పార్టీ నాయకులు లెక్కలు కట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన-బీజేపీలు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే బాగుం టుందనే అభిప్రాయం పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతోంది.
Also Read : Badvel By Poll YCP Jagan -బద్వేల్ ఉప ఎన్నిక : జగన్ కొత్త ఒరవడి..!
వాస్తవానికి ఇప్పటికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. మరోవైపు.. టీడీపీ కూడా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటు న్నారు. 2019లో జరిగిన ఒంటరి పోరు ప్రధానంగా కొంప ముంచిందనే అభిప్రాయం.. ఇప్పటికీ పార్టీలో వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో గత తప్పును పునరావృతం కాకుండా చూసుకునేందుకు పార్టీ వ్యూహా త్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అంతర్గతంగా వస్తున్న సూచనలను పార్టీ అధినేత చంద్రబాబు.. పరిశీలిస్తున్నారు. ఇటీవల పవన్ వ్యాఖ్యలు, సూచనలను పరిశీలిస్తే.. పొత్తులకు సిద్ధమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో కలిసి పని చేస్తున్న పవన్ ఇంక ఎవరి కోసం ఎదురుచూస్తున్నారో ఊహించుకోవచ్చు. అలాగే టీడీపీకి కూడా పాత మిత్రుడిని ఆకర్షించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.
మరోవైపు… జనసేన అధినేత పవన్ కూడా.. ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం.. ప్రజల సంక్షేమం కోసం.. ఎవరితో అయినా.. కలుస్తామంటూ.. ప్రకటించారు. అంటే.. దీని వెనుక టీడీపీ అధినేత వైపు పవన్ చూస్తున్నారనే కొన్నాళ్ల ప్రచారానికి బలం చేకూరినట్టు అయింది. ఈ పరిస్థితులను గమనిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలూ కలిసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అయితే బీజేపీ అధిష్టానం టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గతంలో మోదీని చంద్రబాబు అవమానించారని, ఆయనను అధికారం నుంచి దింపేందుకు మమతా బెనర్జీతో కలిసి ముందుకు నడిచారని ఆ పార్టీ భావిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ స్టెప్ ఏంటనేది చూడాలి.
Also Read : TDP CBN Dicipline -టీడీపీలో కొత్త పంథా : బాబు మార్క్ రాజకీయాలు పని చేయడం లేదా?