Chandrababu, AP Assembly – అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయొచ్చు కదా..? చంద్రబాబు ప్రశ్న ..

సీజనల్‌ రాజకీయం చేయడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయం చూస్తే.. చంద్రబాబు రాజకీయం కాలానుగుణంగా ఎలా మారుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఒక వ్యాఖ్యకు తనకు తానుగా విపరీతార్థం తీసుకుని చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. మీడియా సమావేశంలో భోరున ఏడుస్తూ.. నాకు అవమానం జరిగింది, ఇకపై అసెంబ్లీకి రాను.. సీఎంగా గెలిచిన తర్వాతే వస్తానంటూ మాట్లాడారు.

ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో.. అప్పటి ప్రతిపక్ష నేత.. తమకు మైక్‌ ఇవ్వడం లేదని, మాట్లాడుతున్న సమయంలో ఉన్నఫళంగా మైక్‌ కట్‌ చేస్తున్నారని, తమపై వ్యక్తిగతంగా టీడీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం స్పీకర్‌ ఇవ్వడంలేదంటూ.. ఇకపై ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామని వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పలురకాలుగా మాట్లాడారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఎందుకు.. రాజీనామా చేయొచ్చు కదా.. జీతాలెలా తీసుకుంటారు.. వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత లేదు.. అంటూ విమర్శలు చేశారు.

Also Read : CM Jagan, Floods – వరదలు, తెగిన ప్రాజెక్టులు.. అధికారులతో సీఎం అత్యవసర సమీక్ష

మరి నాడు చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలు.. నేడు ఆయనకు వర్తించవా..? మళ్లీ సీఎం అయ్యే వరకూ అసెంబ్లీకి రానని చంద్రబాబు అంటున్నారు. అంటే ఆయన గతంలో అన్నట్లుగా.. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే ఎందుకు..? అసెంబ్లీకి రాకుండా జీతం ఎలా తీసుకుంటారు..? బాధ్యత లేనట్లేగా..? ఈ ప్రశ్నలు సహజంగానే అందరిలోనూ ఉద్భవిస్తాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని చెబుతున్న చంద్రబాబు రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఆరు నెలల్లోనే కుప్పంలో ఉప ఎన్నికలు వస్తాయి. రాక్షసుల పాలన.. ప్రజలపై భస్మాసుర హస్తం పెడుతున్నారంటూ.. కుప్పం మున్సిపల్‌ ఫలితాల తర్వాత కూడా ఆయన చేస్తున్న విమర్శలు నిజమైతే ఉప ఎన్నికల్లో గెలుస్తారు.

పంచాయతీ, పరిషత్, తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయిన విషయం నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ఈ తరహా నాటకానికి తెరతీశారనే విమర్శలు వస్తున్నాయి. పైగా పార్టీపై పట్టు పూర్తిగా జారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చంద్రబాబుకు ఉప ఎన్నిక అనే మంచి అవకాశం ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కుప్పం ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే స్థానిక సంస్థల్లో పార్టీ ఓటమి నుంచి బయటపడవచ్చు. కుప్పం తనకు ఎప్పటికీ కంచుకోటేనని చాటిచెప్పవచ్చు. జీవితాంతం టీడీపీ అధ్యక్షుడుగా కొనసాగవచ్చు. అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అదే రాజీనామా చేయడం వల్ల ఈ అవకాశాలుంటాయి. సంక్షోభంలో ఉన్న చంద్రబాబు ఉప ఎన్నిక అనే అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా..?

Also Read : AP Assembly Second Day – రెండో రోజు అసెంబ్లీ.. టీడీపీ, వైసీపీ మధ్య పేలిన మాటల తూటాలు

Show comments