Idream media
Idream media
హుజూరాబాద్‌లో నామినేషన్ల రాజకీయం ఆది నుంచీ ఉత్కంఠను రేపుతోంది. రాజకీయ పార్టీల అభ్యర్థులను పక్కన బెడితే.. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల వ్యక్తులు, బాధితులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు చాలా మంది నామినేషన్ల వేస్తామంటూ మొదటి నుంచీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తమ నిరసనను తెలపడానికి హుజూరాబాద్ ను వేదికలా మార్చుకునే ప్రయత్నాలు చేశారు.
నామినేషన్ వేసేందుకు కూడా చాలా మంది రిటర్నింగ్ కార్యాలయాలకు వచ్చారు. ఇలా వచ్చేవారిలో కొందరికి ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)పై అవగాహన లేకపోవడంతో వెనుదిరుగాల్సి వచ్చింది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో మొత్తం ఎంత మంది బరిలో నిలిచేది తేలనుంది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈరోజు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.
కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో అధికారులు సెకండ్ డోస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. వాస్తవానికి ఇది కొత్త నిబంధనేం కాదు, షెడ్యూల్ విడుదలైన సెప్టెంబరు 28వ తేదీన కలెక్టర్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అంతా సెకండ్ డోస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, మాస్క్, శానిటైజేషన్ నిబంధన విధిగా పాటించాలని స్పష్టంచేశారు. కానీ, నామినేషన్ మొదలైన రోజు నుంచి వస్తున్న అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ నిబంధనలను పాటించారు. గుర్తింపులేని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా అనుచరులతో వస్తూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మూడు రోజుల క్రితం దాదాపు 150 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు వచ్చారు. పలు లోపాలు ఉండడంతో అధికారులు వారి నామినేషన్లను తీసుకోలేదు.
ఈ నెల 1వ తేదీన నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండు, మరో ఇండిపెండెంట్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తరువాత రెండు, మూడు తేదీలు సెలవుదినాలు. సోమవారం ఈటల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్, ఇద్దరు ఇండిపెండెంట్లు రెండేసి చొప్పున మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
అనంతరం మంగళవారం కేవలం ఒకే ఒక్కనామినేషన్ దాఖలైంది. కూకట్‌పల్లికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ చాలిక చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్రులు అబ్బాడి బుచ్చిరెడ్డి, నూర్జహాన్ బేగం, రమేష్‌బాబు, మురుగు రామచంద్రు, బరిగె గట్టయ్య (టీఆర్‌ఎస్ రెబల్ ), మహ్మద్ మన్సూర్ అలీ (అన్న వైఎస్సార్ పార్టీ), రిటైర్డ్ ఎంప్లాయిస్‌ను సెకండ్ డోస్ సర్టిఫికెట్ లేదని అధికారులు తిప్పిపంపారు. చేసేదిలేక ఆ అభ్యర్థులంతా వెనుదిరిగారు. కానీ, తహసీల్దార్‌తో రిటైర్డ్ ఎంప్లాయిస్ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
కొందరైతే.. ప్రభుత్వం మా నామినేషన్లు దాఖలు కాకుండా కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. మాస్కుల్లేవని కొందరిని, కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ సర్టిఫికెట్ లేదని ఇంకొందరిని నామినేషన్ వేసేందుకు అనుమతించ లేదని పేర్కొంటున్నారు. నామినేషన్లు దాఖలైతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనతో ప్రభుత్వం ఇలా కుట్రలు చేస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్ శ్యామలయ్య ఆరోపించారు. మూడు రోజుల క్రితం పదాహారు మంది అభ్యర్థులను తిప్పిపంపడం దారుణమన్నారు. ఇలా హుజూరాబాద ఉప ఎన్నిక లో నామినేషన్ల దాఖలులో కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నాటకాలకు నేటితో తెరపడనుంది.