Huzurabad Bypoll- Etela Rajender : పదును తగ్గని ‘ఈట’ల.. ఉప ఎన్నికల్లో అపూర్వ విజయం

తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణ ఆత్మగౌరవం ఎలా ఉంటుందో చూపించారు. తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో తన సత్తాను చాటారు. పార్టీ మారినా, ప్రజల్లో తన పట్టు ఏ మాత్రం సడలలేదని నిరూపించారు. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను ఓడించారు. 23,865 ఓట్ల మెజారిటీతో గెలిచి తిరిగి అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

మంత్రివర్గం నుంచి అవమానకరమైన రీతిలో బర్తరఫ్‌కు గురైన ఈటల.. టీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి.. దశాబ్ధాలుగా తనను ఆదరిస్తున్న హుజురాబాద్‌ ప్రజల వద్దకు వెళ్లారు. తనను ధిక్కరించి, తన నాయకత్వాన్నే సవాల్‌ చేసిన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి సర్వశక్తులు ఒడ్డినా.. ‘ఈట’ల చేవ ముందు అవన్నీ పటాపంచలయ్యాయి.

పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం దక్కినా.. ఆ తర్వాత మొదలైన ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్‌ ఆధిక్యం కనబర్చారు. ఏడో రౌండ్‌ వరకు వరుసగా ఆధిక్యం దక్కింది. 8వ రౌండ్‌లో తొలిసారి టీఆర్‌ఎస్‌ 162 స్వల్ప ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే ఆ తర్వాత రౌండ్‌లో ఈటల సత్తా చాటారు. 9వ రౌండ్‌లో 1835 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు. 11వ రౌండ్‌లో మరోసారి టీఆర్‌ఎస్‌ 367 ఓట్ల ఆధిక్యం దక్కించుకుంది. మళ్లీ 12వ రౌండ్‌ నుంచి ఈటల హవా మొదలైంది.

15వ రౌండ్‌లో 2049 ఓట్ల ఆధిక్యం రావడంతో.. ఈటల రాజేందర్‌ ఆధిక్యం పది వేలు దాటింది. దీంతో అప్పటి వరకు గట్టి పోటీ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. ఈటల రాజేందర్‌ కూడా తన గెలుపుపై నమ్మకంతో తొలిసారి ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఈటల ఆధిపత్యం కొనసాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఈటల ఆధిపత్యం ప్రదర్శించారు. 20వ రౌండ్‌ ముగిసే సమయానికి ఈటల ఆధిక్యం 20 వేల మార్కును దాటింది. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యే సరికి ఈటల 23,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం మీద టీఆర్‌ఎస్‌ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం సంపాధించింది.

రౌండ్లు వారీగా బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఆధిక్యాలు..

1 – 166
2 – 195
3 – 911
4 – 432
5 – 344
6 – 1017
7 – 246
8 – 162 (టీఆర్‌ఎస్‌)
9 – 1835
10 – 526
11 – 367 (టీఆర్‌ఎస్‌)
12 – 1217
13 – 1865
14 – 1046
15 – 2049
16 – 1772
17 – 1423
18 – 1976
19 – 3047
20 – 1474
21 – 2726
22 – 1130

Also Read : Badvel Bypoll – YCP భారీ విజయం

Show comments