Idream media
Idream media
తెలంగాణ అంతటా పండగ మూడ్ లో ఉన్నప్పటికీ.. హుజూరాబాద్ మాత్రం పొలిటికల్ మూడ్ లో. అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అందరూ ఎన్నికల హడావిడిలోనే మునిగితేలుతున్నారు. ఎన్నికలకు మరో పదిహేను రోజులే గడువు ఉండడంతో ప్రతీ అవకాశాన్ని, ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. దసరా పండగ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కుటుంబాలకు వస్త్ర, ధన రూపాల్లో బహుమతులు అందజేస్తున్నారు. కాగా, ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది. ఆ ముగ్గురులోనూ ఒక అంశంలో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారు.
ఆస్తులు – కేసులు
హైవోల్టేజ్ హీట్ రాజేస్తున్న ఈ ఉపయుద్ధాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ బైపోల్ ఎందుకు వచ్చింది? ఈటెల రాజీనామా ఎందుకు చేశారు? ఈ వివాదాలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ గెలుపు ఎవరిదన్నది హాట్‌టాఫిక్‌గా మారింది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఆ ముగ్గురూ ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలను పరిశీలిస్తే.. అధికార టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 22 లక్షల 82 వేలు. చరాస్తులు రూ.2 లక్షల 82 వేల 402గా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన రూ. 4 లక్షల 98 వేలు. తన పేరు మీద ఎలాంటి వ్యవసాయ భూమి లేదని భార్య పేరుమీద మాత్రం 12 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు గెల్లు శ్రీనివాస్. ఇక తన పేరుమీద 1,210 గజాల స్థలం, రూ.20 లక్షల విలువ చేసే ఇల్లు ఉందని పేర్కొన్నారు. ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు. తనపైన నమోదైన కేసుల వివరాలును కూడా పొందుపరిచారు. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పేర్కొన్నారు.
ఈటెల కంటే.. భార్యే రిచ్
ఇక, బీజేపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి ఈటెల మొత్తం ఆస్తుల విలువ రూ.16 కోట్ల 12 లక్షలు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక సంపాదన 30 లక్షల 16 వేల 592 రూపాయలుగా పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన భార్య జమున సంపాదన రూ. కోటి దాటిపోయింది. ఈటల ఎలాంటి బిజినెస్ చేయడం లేదని వెల్లడించారు. వ్యాపారాలన్నీ ఆయన భార్య జమున పేరుమీదే ఉన్నాయి.. జమున హ్యాచరీస్, అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, SVS అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. ఈటెల పేరు మీద సొంత వాహనం లేదు. కానీ ఆయన భార్య పేరు మీద 3 SUV వెహికిల్స్ ఉన్నాయి. కేజీన్నర గోల్డ్ ఉంది. దీని విలువ రూ. 50 లక్షల పైమాటే. ఈటెల జమున మొత్తం ఆస్తులు రూ. 43 కోట్లు. ఇందులో డిపాజిట్లు రూ.28 కోట్ల 68 లక్షలు. స్థిరాస్తులు రూ.14 కోట్ల 78 లక్షలు. ఇక, భార్యాభర్తల పేరుపై రూ.కోట్ల విలువైన భూములున్నాయి. అప్పుల డీటైల్స్ చూస్తే ఈటెల పేరుపై రూ.3 కోట్ల 62 లక్షల 42 వేలు కాగా.. జమున పేరుపై రూ.4 కోట్ల 89 లక్షల 77 వేల అప్పు ఉంది.
ఆ విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ మొత్తం ఆస్తులు రూ. 59 లక్షల 51 వేలు. ఒక సఫారీ కారు ఉంది. వివిధ రకాల ఆందోళనలు చేపట్టినప్పుడు నమోదైన 8 కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. రూ. 15 లక్షల విలువైన స్థిరాస్తులు.. రూ. కోటి 45 లక్షల 2 వందల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తల్లి బల్మూరి పద్మ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించారు వెంకట్. అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆస్తుల విలువ ఎక్కువ. సెకండ్ ప్లేస్‌లో బల్మూరి వెంకట్ ఉండగా మూడో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.