నిన్నటి వరకూ వైసీపీ కార్యకర్త.. నేడు డీజీపీ అయ్యారా..?

ఏపీ డీజీపీగా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ విషయంలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. దాదాపు మూడేళ్లపాటు డీజీపీగా పనిచేసిన సవాంగ్‌ బదిలీ చేయగానే.. ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలకు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటాశారంటూ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వాపోవడం విచ్రితంగా ఉంది. యనమలే కాదు.. మంగళవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా సవాంగ్‌ బదిలీపై తెగ బాధపడిపోయారు. ఇప్పుడు సవాంగ్‌ను బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని కూడా జనసేనాని ప్రశ్నించి ఆశ్చర్యపరిచారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీగా సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వహయాంలో ఆయన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. డీజీపీ ఎంపిక విషయంలో అనేక పేర్లు తెరపైకి రాగా.. చివరికి గౌతమ్‌ సవాంగ్‌ను సీఎం జగన్‌ ఎంపిక చేసుకున్నారు. దాదాపు మూడేళ్లపాటు డీజీపీగా సేవలందించిన సవాంగ్‌ను.. తాజాగా జగన్‌ సర్కార్‌ బదిలీ చేసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించింది. నియామకాలు, బదిలీలు పరిపాలనలో సర్వసాధారణంగా జరిగేవే. పోస్టింగ్‌ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే బదిలీచేస్తే.. అవమానించినట్లు, లేదా అన్యాయం చేసినట్లు.. కానీ దాదాపు మూడేళ్ల తర్వాత బదిలీచేస్తే.. అదేదో సవాంగ్‌ను సీఎం జగన్‌ అవమానించినట్లుగా టీడీపీ, జనసేన పార్టీలు చిత్రీకరిస్తుండడం విడ్డూరంగా ఉంది.

ఇప్పటికిప్పుడు సవాంగ్‌పై టీడీపీకి పుట్టుకొచ్చిన ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నిన్న మొన్నటి వరకు సవాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. కనీస గౌరవమర్యాదలు పాటించకుండా వైసీపీ కార్యకర్త అంటూ అవమానించింది. వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు నుంచి టీడీపీ కింది స్థాయి నేత వరకు విమర్శలు చేశారు. పోలీసు ప్రతిష్టను సవాంగ్‌ మంటగలుపుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్న ఏ పార్టీ కూడా వ్యవహరించని విధంగా గౌతమ్‌ సవాంగ్‌ పట్ల దారుణంగా వ్యవహరించిన టీడీపీ.. ఇప్పుడు ఆయన్ను బదిలీచేయడం అన్యాయమని, ఇది అవమానించడమేనని మాట్లాడడం విచిత్రంగా ఉంది. టీడీపీ నేతలు అన్నట్లుగా.. వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న అధికారి బదిలీ అయితే సంతోషపడాలి గానీ.. బాధపడడం వెనుక ఆంతర్యమేమిటో..?

Also Read : విద్యారంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు జవహర్‌?

Show comments