అమ‌రావ‌తి ఉద్య‌మం ఎలా ఉంటే మేలు…

రాజ‌ధాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెంద‌రో తెలియ‌దు కానీ.. భూములు ఇచ్చిన రైత‌న్న‌లు మాత్రం చాలా మందే ఉన్నారు. వారంద‌రికీ స‌లాం. ల‌క్ష కోట్ల ప్రాజెక్టు అని, భ‌విష్య‌త్ బంగారు మ‌య‌మ‌ని గ‌త ప్ర‌భుత్వం చేసిన ప్ర‌చారానికి ఆక‌ర్షితులై కొంద‌రు, భ‌యంతో మ‌రికొంద‌రు, బెదిరింపుల‌కు లొంగి ఇంకొంద‌రు ఎలాగైతేనేం.. వేలాది ఎక‌రాల భూమిని రాజ‌ధాని కోసం అంటే ఇచ్చారు. అయితే, న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రిగా అధికారంలోకి వ‌చ్చిన నారా చంద్ర‌బాబునాయుడు ఐదేళ్ల కాలంలో క‌నీసం ఓ రూపు కూడా రాజ‌ధానికి తేలేక‌పోయార‌నేది వాస్త‌వం. ఇంకా అనుభ‌వించే అవ‌కాశం ఉన్నా ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ను వ‌దులుకుని.. హ‌డావిడిగా కార్యాల‌యాల‌ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయాల‌నే ఉద్దేశంతో ఏర్ప‌డిన తాత్కాలిక నిర్మాణాలు త‌ప్పా, శాశ్వ‌త అభివృద్దికి తీసుకున్న చ‌ర్య‌లు లేవు.

ఫ‌లితంగా ప‌ట్టు పంచె, స‌న్మానాలు త‌ప్పా రైతుల‌కు ఒరిగిన ప్ర‌యోజ‌నం క‌రువు. వారి భూముల‌ను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేందుకు చేసిన ప్ర‌య‌త్నాలూ జ‌ర‌గ‌లేదు. రాష్ట్రం కోసం త‌మ భూముల‌ను త్యాగం చేసిన ఎంద‌రో రైతుల క‌ల నెర‌వేర‌లేదు. అందుకే అమ‌రావ‌తిలోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. అనంత‌రం అధికారంలోకి జ‌గ‌న్ స‌ర్కార్.. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటనను తెర‌పైకి తెచ్చింది. ముంద‌స్తు వివ‌ర‌ణ‌లు లేకుండా, దాని వెనుక ఉద్దేశం పేర్కొన‌కుండా ఈ అనూహ్య ప్ర‌క‌ట‌న వ‌ల్ల‌ భూములు ఇచ్చిన రైతులు ఆందోళ‌న చెంద‌డం స‌హ‌జ‌మే. ఆ ఆందోళ‌న‌నే ఉద్య‌మంగా మార్చేందుకు టీడీపీ రంగంలోకి దిగిపోయింది. రాజ‌ధాని త‌ర‌లిపోతోంది.. ఇక్క‌డ అభివృద్ధి ఆగిపోతుంది.. అంతా అల్ల‌క‌ల్లోలం అయిపోతుందంటూ రైతుల్లో మ‌రింత ఆందోళ‌న‌ను పెంచింది. దీంతో ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌ర్నాడు నుంచే అమ‌రావ‌తి ఉద్య‌మం మొద‌లైంది.

అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో ఆరువంద‌ల రోజులుగా ఉద్య‌మం కొన‌సాగుతోంది. అయితే, రైతుల్లో మొద‌ట్లో ఉన్న ఆందోళ‌న ప్ర‌స్తుతం లేదు. ఆ ప్ర‌క‌ట‌న అనంత‌రం మూడు రాజ‌ధానుల ఆవ‌శ్య‌క‌త‌ను, అమ‌రావ‌తిలో జ‌రిగే మార్పుల‌ను ప్ర‌భుత్వం రైతుల‌కు వివ‌రించింది. వారితో చ‌ర్చించింది. కోట్లాది రూపాయ‌లు ఒకే చోట కుమ్మ‌రించి అభివృద్ధి చేస్తే.. హైద‌రాబాద్ విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్లు పున‌రావృత‌మ‌వుతాయ‌ని, ప్రాంతాల మ‌ధ్య వైష‌మ్యాలు పెరుగుతాయ‌ని పేర్కొంది. అన్ని ప్రాంతాల స‌మ‌గ్రాభివృద్ధి కోసం మూడు రాజ‌ధానుల అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాల‌ను వెలిబుచ్చింది. ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌తో కొంత మంది రైతులు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికారు. శాస‌న రాజ‌ధానిగా కొన‌సాగనున్న అమ‌రావ‌తికి క‌లిగే న‌ష్టం లేద‌ని తెలుసుకుని ఉద్య‌మానికి దూర‌మ‌వుతూ వ‌చ్చారు.

అయితే, అధికార పార్టీ, తన అధికార బలంతో, అమరావతిని తొక్కి పడేసింద‌ని, మూడు రాజధానులంటూ కపట నాటకానికి తెరలేపింద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు చేస్తూ కొంత మందిని కూడ‌గ‌ట్టుకుని ఇప్ప‌టికీ ఉద్య‌మం చేస్తున్న వారు ఉన్నారు. వారిలో చాలా మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నార‌ని అధికార పార్టీ విమ‌ర్శిస్తుంటే, ఉద్య‌మ‌కారుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షం పేర్కొంటోంది. ఎవ‌రివాద‌న నిజ‌మ‌నేది ప‌క్క‌న బెడితే.. అస‌లు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఇప్ప‌టికీ ఉద్య‌మం సాగిస్తుండ‌డం లాభ‌మా, న‌ష్ట‌మా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఇందుకు కార‌ణాలు లేక‌పోలేదు. మూడు రాజ‌ధానుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయ‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగింది. ప్ర‌ధానంగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర జిల్లాలకు కూడా అభివృద్ధి అనే ఆశ పెరిగింది.

మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా మూడు రాజ‌ధానుల‌కు సానుకూలంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారు కూడా అన్ని ప్రాంతాల స‌మ‌గ్రాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఆ మేర‌కు ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికీ ఉద్య‌మం పేరుతో ఓ ప్రాంతంలో విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డం భావ్య‌మా, ఆ ప్రాంత రైతుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా అభివృద్ధి కోసం ఏం చేయాలో చ‌ర్చించ‌డం అవ‌స‌ర‌మా అనేది ప‌రిశీలించాల్సి ఉంది. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌కుండా రాజధాని అమరావతి ఉద్యమానికి 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా కొంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఉద్యమం అంటే సరైన దారిలో వెళ్లాలి. ఆమోద‌యోగ్య‌మైన ప‌రిష్కారం కోసం ప‌ట్టుబ‌ట్టాలి.

ఏపీకి ఇప్ప‌టికీ ఏకైక రాజ‌ధానే ఉండాల‌ని పోరాడ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టు, అమరావతి పరిరక్షణ సమితి స‌రైన రీతిలోనే వెళ్తోందా, స‌మితి ల‌క్ష్యం రైతుల‌కు మంచి చేయ‌డ‌మే అయితే.. వంద రోజులు, వేయి రోజులుగా పోరు సాగుతోందంటూ చెప్పుకోవ‌డం మేలా, ప్ర‌భుత్వంతో చ‌ర్చించి అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన‌ రైతుల‌కు న్యాయ‌ప‌రంగా ద‌క్కాల్సిన అంశాల‌పై స్పందించ‌డం మేలా అనేది ఆలోచించాలి. చంద్ర‌బాబు, లోకేష్ కూడా ఎప్ప‌టికీ అమ‌రావ‌తే రాజ‌ధాని అంటూ ఇప్ప‌టికీ మ‌భ్య‌పెడుతుండ‌డంపై పున‌రాలోచించాలి.

Show comments