యూట్యూబ్‌లో తాము పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ పెంచేందుకు కొందరు యూట్యూబర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే వ్యూస్ కోసం చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు రూపొందిస్తుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ మాత్రం ఎవరు ఊహించని పనిచేశాడు. వీక్షకులను ఆకట్టుకుని వ్యూస్ పెంచుకోవడమే లక్ష్యంగా కాలిఫోర్నియాలోని లాస్ పాడర్స్ జాతీయ అటవీ ప్రాంతంలో ఓ సింగిల్ ఇంజన్ విమానాన్ని కూల్చేశాడు ఆ ఘనుడు.
అవును.. తాను స్వయంగా నడుపుతున్న విమానం ఆకాశంలో ఉండగా బయటకు దూకేసిన ఆ వ్యక్తి… ప్యారాచూట్ సాయంతో గాల్లో తేలుతూ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవ్వడాన్ని వీడియో తీశాడు. అమెరికా మాజీ ఒలింపియన్ ట్రెవర్ జాకబ్ ఈ పిచ్చిపని చేశాడు. 2021 డిసెంబర్‌లో జరిగిన ఈ క్రాష్‌కు సంబంధించిన వీడియోను జాకబ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా ఇప్పటిదాకా 1.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అయితే, జాకబ్ చెప్పినదాని ప్రకారం ఈ క్రాష్ ఓ ప్రమాదమని తొలుత అంతా భావించారు. కానీ, వైమానిక రంగ నిపుణులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ)ఈ వీడియోపై దర్యాప్తు చేపట్టింది. జాకబ్ కావాలనే తన విమానాన్ని కూల్చేశాడని తేల్చింది. దీంతో నిబంధనలు అతిక్రమించాడని పేర్కొంటూ అతని ప్రైవేట్ పైలెట్ లైసెన్స్‌ను రద్దు చేసి జాకబ్‌కు షాకిచ్చింది.